Itc Hikes Cigarette Prices ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. గతేడాది సెప్టెంబరులో జీఎస్టీ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా ఉత్పత్తులు, వస్తువులపై జీఎస్టీ తగ్గించగా.. వాటి ధరలు దిగొచ్చాయి. ఇదే సమయంలో పొగాకు, సిగరెట్ వంటి వాటిపై జీఎస్టీని 40 శాతానికి పెంచి.. అదనంగా ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా సిగరెట్ ధరలు భారీగా పెరిగాయి.
కొంత మందికి ముక్క లేనిదే ముద్ద దిగదన్నట్లుగా కొందరికి దమ్ము కొట్టందే పొద్దుపోదు. అదేనండీ సిగరెట్ గురించే మాట్లాడేది. సిగరెట్ ప్రియులకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘కింగ్’ సైజులో జీఎస్టీ బాదేసింది. 2025 సెప్టెంబర్- అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంలో కొత్త తరం సంస్కరణల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంతకుముందు 5 శ్లాబులు ఉండగా.. వీటిల్లో 12, 28 శాతం శ్లాబుల్ని తొలగించింది. ప్రస్తుతం 0, 5, 18 శాతం శ్లాబులే ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కువ శ్లాబుల్లోని వస్తువులు, ఉత్పత్తులు తక్కువ శ్లాబుల్లోకి చేరగా.. 5 శాతం నుంచి చాలా వరకు జీరో శ్లాబులోకి వచ్చేశాయి. దీనికి అనుగుణంగా ఆయా వస్తువులు, ఉత్పత్తుల ధరల్ని తయారీ కంపెనీలు తగ్గించేశాయి. బైక్స్, కార్లపైనా జీఎస్టీ భారీగా తగ్గింది.
ఇక్కడే కేంద్రం మరో వర్గానికి గట్టి షాక్ ఇచ్చింది. సిగరెట్లు, పాన్ మసాలా సహా ఇతర పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచడంతో పాటు.. అదనంగా ఎక్సైజ్ సుంకాల్ని కూడా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. సిగరెట్ల పొడవును బట్టి, రకాన్ని బట్టి అదనపు ఎక్సైజ్ డ్యూటీ 1000 సిగర్ స్టిక్స్‌పై రూ. 2050 నుంచి రూ. 8500 వరకు విధించారు. ప్రీమియం, పొడవాటి సిగరెట్లపై ఈ పన్ను భారం ఎక్కువగా ఉండనుంది.
కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా తమపై భారం తగ్గించుకునేందుకు ఆయా కంపెనీలు సిగరెట్ ధరల్ని పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఐటీసీ ఇప్పటికే ధరల్ని పెంచినట్లు తెలుస్తోంది. కనీసం సిగరెట్ బ్రాండ్‌ను బట్టి.. 19 శాతం నుంచి గరిష్ఠంగా 41 శాతం ధరల్ని పెంచినట్లు సమాచారం.
గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం 10 సిగరెట్ల ప్యాకెట్ ధర రూ. 170 నుంచి రూ. 240 కి చేరింది. ఇక్కడ ఒక్కో సిగరెట్ ధర రూ. 7 చొప్పున పెరిగిందన్నమాట. గోల్డ్ ఫ్లేక్ (20s)- క్లాసిక్ (20s) 20 ప్యాక్ ధర రూ. 340 నుంచి రూ. 480 కి చేరింది. క్లాసిక్ కనెక్ట్ (స్లిమ్స్) ధర ఏకంగా 20 శాతం పెరిగి రూ. 300 నుంచి రూ. 360 కి చేరింది. గోల్ట్ ఫ్లేక్ సూపర్‌స్టార్ (వాల్యూ) 10 సిగరెట్ల ప్యాక్ ధర రూ. 59 నుంచి రూ. 70 కి చేరింది. ఇక్కడ 19 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. విల్స్ నేవీ కట్ (76MM) ధర గతంలో రూ. 95 గా ఉండగా.. ఈ 10 స్టిక్స్ ప్యాక్ ధర ఇప్పుడు రూ. 120 కి పెరిగినట్లు తెలుస్తోంది.
ఆయా కంపెనీలు తమ లాభాల్ని నిలుపుకునేందుకు.. జీఎస్టీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ భారాన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులపై మోపేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీసీతో పాటు ఇతర ప్రముఖ కంపెనీలు గాడ్‌ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్ కూడా ధరల్ని పెంచనున్నట్లు తెలుస్తోంది. సిగరెట్ ధరల పెంపు వార్తల నేపథ్యంలో ఫిబ్రవరి 18న ఐటీసీ షేరు 2 శాతానికిపైగా పెరిగి రూ. 332.65 వద్ద స్థిరపడింది. మార్కెట్ విలువ రూ. 4.16 లక్షల కోట్లుగా ఉంది.
