UPI Block Mechanism : యూపీఐ.. ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. చాలా ప్రపంచదేశాల్లోనూ మన యూపీఐ పేమెంట్ టెక్నాలజీని వాడేస్తున్నారు. ఈ లిస్టులో ఆఫ్రికా దేశాలు, అరబ్ దేశాలు, ఐరోపా దేశాలు కూడా ఉన్నాయి. యూపీఐ టెక్నాలజీతో మరో విప్లవానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ తెరతీసింది. సెకండరీ స్టాక్ మార్కెట్లోనూ యూపీఐ బ్లాక్ మెకానిజం సదుపాయాన్ని స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్లకు అందించాలని సెబీ ప్రతిపాదించింది. వాస్తవానికి 2024 సంవత్సరం జనవరిలోనే యూపీఐ బ్లాక్ మెకానిజాన్ని సెబీ ఆవిష్కరించింది. ఈ పద్ధతిని వాడుకొని క్లయింట్లు నేరుగా తమతమ ఫోన్లలోని యూపీఐ ఆధారిత బ్లాక్ మెకానిజంతో(UPI Block Mechanism) సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేయొచ్చు.
We’re now on WhatsApp. Click to Join
ఈజీ భాషలో చెప్పాలంటే.. మనం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం జెరోధా, అప్‌స్టాక్స్, గ్రో వంటి ప్లాట్‌ఫామ్స్ వాడుతుంటాం. ఆయా ప్లాట్‌ఫామ్స్‌లోకి నిధులను బదిలీ చేసే బదులు సొంత అకౌంటులోనే బ్లాక్ చేసిన మొత్తంతో కస్టమర్లు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని క్లయింట్లకు అందించడం అనేది ఇప్పటిదాకా ఒక ఆప్షనల్‌గా ఉండేది. దీన్ని ఇక తప్పనిసరి చేస్తామని సెబీ ఇటీవల ప్రపోజ్ చేసింది. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే క్లయింట్ల నిధులు, షేర్లకు అదనపు రక్షణ లభిస్తుందని సెబీ వాదిస్తోంది. ఈ ప్రక్రియ వల్ల స్టాక్ బ్రోకర్‌కు క్లయింట్లు నిధులను బదిలీ చేసే ప్రక్రియ కూడా తొలగిపోతుంది. క్లయింట్లకు, క్లియరింగ్ కార్పొరేషన్(సీసీ)కు మధ్య సెటిల్‌మెంట్ నేరుగా జరుగుతుంది. దీనివల్ల మదుపర్ల డబ్బులను బ్రోకర్లు దుర్వినియోగం చేసే అవకాశం అనేదే ఉండదు. ఈ పద్ధతి అమల్లోకి వస్తే క్లయింట్లు తమకు సేవలందిస్తున్న బ్రోకర్ నుంచి మరో బ్రోకర్‌కు మారిపోవడం ఈజీ అయిపోతుంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం సేవింగ్స్ ఖాతాలో బ్లాక్ అయిన అమౌంటుపై వడ్డీ కూడా లభిస్తుంది.
Also Read :Vijayawada Rains : 30 ఏళ్ల రికార్డు బ్రేక్.. విజయవాడలో కుండపోత.. జనజీవనం అస్తవ్యస్తం
ప్రస్తుతం జెరోధా, అప్‌స్టాక్స్, గ్రో వంటి ప్లాట్‌ఫామ్సలలో నగదు విభాగంలో దాదాపు 6.51 కోట్ల మంది క్లయింట్లు ఉన్నారు. వీరంతా యూపీఐ బ్లాక్ మెకానిజానికి మారినా, వాటిని ప్రాసెస్ చేసే సామర్థ్యం యూపీఐకి ఉంది. ఈ ప్రపోజల్‌పై ఇప్పటికే సీసీలు, ఎన్‌పీసీఐ, ట్రేడింగ్ సభ్యులు, బ్యాంకులతో సెబీ చర్చించింది. ఈ ప్రతిపాదనలపై ప్రజలు కూడా సెప్టెంబరు 12లోగా తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు.