Rupee Fall : భారత రూపాయి మరోసారి డీలా పడింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి ఆల్ టైం కనిష్ఠ స్థాయికి పతనమైంది. అమెరికా డాలరుతో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ తొలిసారిగా రూ.85కు చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లకు తగ్గించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. 2025 సంవత్సరంలోనూ మరిన్ని సార్లు వడ్డీరేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ తగ్గించనుందనే అంచనాల నడుమ రూపాయి విలువ తగ్గిపోయింది. వాస్తవానికి బుధవారం రోజు జరిగిన కరెన్సీ ట్రేడింగ్‌లోనే భారత రూపాయి(Rupee Fall) మారకం విలువ రూ.84.95కు చేరిపోయింది. తాజాగా ఇవాళ ఉదయం కరెన్సీ ట్రేడింగ్ ప్రారంభం కాగానే ఆ విలువ కాస్తా రూ.85.06 స్థాయిని టచ్ చేసింది. మరోవైపు ఇతర ఆసియా దేశాల కరెన్సీలు కూడా గురువారం బలహీనపడ్డాయి. దక్షిణ కొరియాకు చెందిన వన్, మలేషియాకు చెందిన రింగిట్, ఇండోనేషియాకు చెందిన రూపియా ఇవాళ సగటున 0.8 శాతం నుంచి 1.2 శాతం మేర పతనమయ్యాయి.
Also Read :Mumbai Terror Attack : ముంబై ఉగ్రదాడి సూత్రధారి రాణాను భారత్‌కు అప్పగించాల్సిందే.. సుప్రీంకోర్టులో అమెరికా వాదన
రూపాయి బలహీనతకు కారణాలివీ..
- డాలరుతో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ తగ్గడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో కొన్ని కారణాలు మన దేశంలోనే ఉత్పన్నమయ్యేవి. ఇంకొన్ని కారణాలు విదేశాల్లో ఉత్పన్నమయ్యేవి.
- భారత ఆర్థిక పురోగతి రేటు అనేది చాలా నెమ్మదించింది. ప్రత్యేకించి జులై – సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక పురోగతి రేటు అనేది 7 త్రైమాసికాల కనిష్ఠ స్థాయికి నెమ్మదించింది.
- దేశంలోని ఆర్థిక వ్యవస్థలో మూలధన ప్రవాహం అనేది గణనీయంగా తగ్గిపోయింది.
- అమెరికా డాలరును బలోపేతం చేసుకునే క్రమంలో ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత రూపాయిని బలహీనపరుస్తున్నాయి.
- ప్రస్తుత పరిస్థితుల్లో భారత రూపాయిని బలోపేతం చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రంగంలోకి దిగనుంది. కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ ఆర్‌బీఐ త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
- 2024 సంవత్సరంలో ఇప్పటివరకు భారత రూపాయి దాదాపు 2 శాతం మేర డీలా పడింది. అయితే ఆసియాలోని ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మంచి పరిస్థితిలోనే మన రూపాయి ఉంది.