. దేశీయ విమానయాన రంగంలో కొత్త ఊపిరి
. శరవేగంగా విస్తరిస్తున్న దేశీయ విమానయాన విపణి
. రక్షణ రంగంలో ఇంజిన్ అభివృద్ధికి ప్రాధాన్యం
Rolls Royce: భారత్‌లో దేశీయ విమానయాన రంగం గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన వేగంతో వృద్ధి చెందుతోంది. ప్రయాణికుల సంఖ్య పెరగడం, కొత్త రూట్లు ప్రారంభం కావడం, విమానాశ్రయ మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కారణాలతో ఈ రంగం ప్రపంచ స్థాయిలో కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు 1200కు పైగా కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలు కేవలం సరఫరాదారులుగానే కాకుండా, భారత్‌లోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికి అనుగుణంగా ఇది దేశానికి మరింత పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకొచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
బ్రిటన్‌కు చెందిన విమాన ఇంజిన్‌ల తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్ కూడా భారత్‌ను తమ ముఖ్యమైన గ్లోబల్ మార్కెట్లలో ఒకటిగా మార్చాలని యోచిస్తోంది. బ్రిటన్ వెలుపల తమ మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రోల్స్ రాయిస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శశి ముకుందన్ వెల్లడించారు. జెట్ ఇంజిన్లు, నావల్ ప్రొపల్షన్, ల్యాండ్ సిస్టమ్స్, అడ్వాన్స్‌డ్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో భారత్‌లో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సంస్థ భావిస్తోంది. ఈ దిశగా భారీ పెట్టుబడుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో రక్షణ, పారిశ్రామిక రంగాలు వేగంగా విస్తరిస్తుండటం తమకు విశ్వాసాన్ని కలిగిస్తోందని ముకుందన్ అన్నారు. భారత రక్షణ రంగంలో కీలకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కార్యక్రమం కింద తయారయ్యే యుద్ధ విమానాల కోసం తదుపరి తరం ఏరో ఇంజిన్‌ల అభివృద్ధికి రోల్స్ రాయిస్ ప్రాధాన్యత ఇస్తోంది.
ఏఎంసీఏ ఇంజిన్ కోర్‌ను నావల్ మెరైన్ ఇంజిన్‌గా మార్చడమే కాకుండా, విద్యుత్ ప్రొపల్షన్ అవసరాలకు కూడా వినియోగించవచ్చని సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏరో ఇంజిన్‌ను మెరైన్ ఇంజిన్‌గా మార్చగల సామర్థ్యం ఉన్న కొద్ది కంపెనీల్లో రోల్స్ రాయిస్ ఒకటిగా గుర్తింపు పొందింది. భారత నావికాదళ పోరాట సామర్థ్యాన్ని పెంచేలా విద్యుత్ ప్రొపల్షన్ పరిష్కారాల్లో కీలక పాత్ర పోషించగలదని సంస్థ భావిస్తోంది. ఇదే క్రమంలో భారత్‌లోని రెండు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ముకుందన్ తెలిపారు. ఒక ఒప్పందం అర్జున్ ట్యాంక్‌ల ఇంజిన్‌ల తయారీకి సంబంధించగా, మరోది భవిష్యత్‌కు సిద్ధమైన కాంబాట్ వాహనాల ఇంజిన్‌ల అభివృద్ధి కోసం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. ఈ భాగస్వామ్యాల ద్వారా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
