PM Kisan: భారతదేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రాబోయే తదుపరి వాయిదా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత వాయిదా కొన్ని నెలల క్రితం అందించబడింది. ఇప్పుడు రైతులు 22వ వాయిదా కోసం వేచి చూస్తున్నారు. తద్వారా రాబోయే సాగు సీజన్ కంటే ముందే వారికి కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.
PM కిసాన్ పథకం అంటే ఏమిటి?
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏటా రూ. 6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా రైతు బ్యాంక్ ఖాతాలకు నేరుగా రూ. 2,000 చొప్పున మూడు వాయిదాలలో జమ చేస్తారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ఇతర అవసరాల కోసం రైతులకు సహాయం చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
22వ వాయిదా ఎప్పుడు వస్తుంది?
పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకు 21 వాయిదాలు విడుదలయ్యాయి. 21వ వాయిదాను నవంబర్ 19, 2025న అందించారు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున బదిలీ చేస్తారు. ఈ లెక్కన 22వ వాయిదా ఫిబ్రవరి 2026 మొదటి లేదా రెండవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 8 ప్రాంతంలో ఈ డబ్బు జమ కావచ్చని అంచనా. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read: భారత్- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!
వాయిదా స్టేటస్‌ను ఎలా తనిఖీ చేయాలి?
రైతులు ఈ క్రింది దశల ద్వారా ఆన్‌లైన్‌లో తమ స్టేటస్‌ను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.
- pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- ‘Farmers Corner’ విభాగంలో ‘Know Your Status’ పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.
- వచ్చిన OTP ని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
- ఇప్పుడు మీ స్క్రీన్‌పై పేమెంట్ స్టేటస్, FTO స్టేటస్ మరియు బ్యాంక్ వివరాలను చూడవచ్చు.
డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
సాంకేతిక కారణాలు లేదా పత్రాల లోపాల వల్ల కొన్నిసార్లు వాయిదా ఆలస్యం కావచ్చు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం, స్టేట్ లెవల్ అప్రూవల్ పెండింగ్‌లో ఉండటం, తప్పు బ్యాంక్ వివరాలు లేదా e-KYC పూర్తి చేయకపోవడం వల్ల డబ్బులు ఆగిపోవచ్చు. ఈ లోపాలను సరిదిద్దుకున్న తర్వాత సాధారణంగా 2 నుండి 4 వారాలలోపు సమస్య పరిష్కారం అవుతుంది.
