Solar Soundbox : సోలార్ సౌండ్‌బాక్స్‌ను పేటీఎం (Paytm) విడుదల చేసింది. ఇది సోలార్ పవర్‌తో నడుస్తుంది. తక్కువ సూర్యకాంతితోనూ ఈ సౌండ్ బాక్స్ ఛార్జ్ అవుతుంది. దీనివల్ల పేటీఎం సోలార్ సౌండ్‌బాక్స్‌లను కొనే వ్యాపారులకు విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయి. ఈ బాక్స్‌ల పైభాగంలో సోలార్ ప్యానెళ్లు ఉంటాయి. సూర్యకాంతి తగిలేలా వీటిని ఉంచితే, ఆటోమెటిక్‌గా ఛార్జ్ అవుతాయి. ఈ సౌండ్ బాక్స్(Solar Soundbox)లో రెండు బ్యాటరీలు ఉంటాయి. వీటిలో ఒకటి సౌరశక్తితో, మరొకటి కరెంటుతో ఛార్జ్ అవుతుంది. మన వెసులుబాటును బట్టి ఏ రకంగానైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు. సోలార్ పవర్‌తో కనీసం 2 నుంచి 3 గంటల పాటు ఛార్జ్ చేస్తే రోజుంతా పేటీఎం సౌండ్ బాక్స్ పనిచేస్తుంది. కరెంట్‌తో దీన్ని ఒక్కసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 10 రోజుల దాకా పనిచేస్తుంది. ఈ సౌండ్ బాక్స్‌తో 4జీ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా చేయొచ్చు. దీనిలో 3W స్పీకర్ ఉంటుంది. 11 భాషల్లో ఆడియో నోటిఫికేషన్‌లను ఇది అందిస్తుంది.
‘పేటీఎం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్’
మూచువల్ ఫండ్‌లకు ఇప్పుడు భారీ రేంజులో గిరాకీ ఉంది. ప్రతినెలా ఎంతోమంది ప్రజలు వీటిలో తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. దీంతో నిధుల సమీకరణ కోసం కొత్తకొత్త మూచువల్ ఫండ్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో పేటీఎం కంపెనీ జతకట్టింది. చిన్నతరహా సిప్ పేమెంట్ సౌలభ్యంతో ‘పేటీఎం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్’ను ఏర్పాటు చేసింది. దీనికి జన్ నివేష్ అని పేరు పెట్టారు. దీనిలో మనం ప్రతినెలా రూ.250 చొప్పున జమ చేసుకోవచ్చు. దీనిపై ప్రకటన వెలువడిన తర్వాత స్టాక్ మార్కెట్‌లో పేటీఎం షేర్ ధర 1 శాతానికి పైగా లాభపడింది. ప్రస్తుతం పేటీఎం షేరు ధర రూ.718.55 వద్ద ఉంది. గత ఏడాది వ్యవధిలో పేటీఎం కంపెనీ షేర్లు ఏకంగా 115 శాతం మేర పెరిగాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దేశంలోని కోటి మంది పెట్టుబడిదారులకు చేరువకావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేటీఎం తెలిపింది. ఇందులో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య 4 కోట్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.