Site icon HashtagU Telugu

Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

Online Sales

Online Sales

Online Sales: జీఎస్టీ (GST) రేట్లలో కోత విధించడంతో పండుగ సీజన్‌లో కొనుగోళ్లు (Online Sales) ఊపందుకున్నాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లు, మెట్రో నగరాల్లో డిమాండ్ 23 నుండి 25 శాతం వరకు పెరిగినట్లు కనిపించింది. సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలలో భాగంగా పెద్ద స్క్రీన్ ఉన్న టీవీలు, ఫర్నిచర్ మధ్య శ్రేణి ఫ్యాషన్ ఉత్పత్తులపై పన్ను శ్లాబ్‌లను తగ్గించారు. దీనివల్ల ధరలు తగ్గి, వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం లభించింది.

ప్రధాన ప్రభావాలు

పెద్ద టీవీలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. దీంతో ధరల్లో 6-8% తగ్గుదల కనిపించింది. ప్రీమియం మోడళ్ల డిమాండ్ పెరిగింది. రూ. 2,500 కంటే తక్కువ ధర ఉన్న ఫ్యాషన్ ఉత్పత్తులపై ఇప్పుడు కేవలం 5% జీఎస్టీ మాత్రమే విధించబడుతోంది. దీనివల్ల అమ్మకాలు వేగవంతమయ్యాయి. ఫర్నిచర్ డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. రెడ్‌సీర్ నివేదిక ప్రకారం.. మొదటి రెండు రోజుల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 23-25% పెరిగాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలు, పండుగ సీజన్ డిమాండ్ కలయికతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి.

Also Read: Harmanpreet Kaur: చ‌రిత్ర సృష్టించేందుకు ఇది ఓ అవ‌కాశం: హర్మన్‌ప్రీత్ కౌర్

ఈ-కామర్స్‌పై ప్రభావం

డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందంటే కొన్ని యాప్‌లు నెమ్మదించాయి. ఆర్డర్ ఇచ్చేటప్పుడు క్రాష్ అయ్యాయి కూడా. అమెజాన్ మొదటి రెండు రోజుల్లో 38 కోట్లకు పైగా కస్టమర్ల రికార్డును నమోదు చేసింది. వీరిలో 70% కంటే ఎక్కువ మంది కస్టమర్‌లు అగ్రశ్రేణి 9 మెట్రో నగరాల వెలుపలి వారే. ఫ్లిప్‌కార్ట్ కూడా గత ఏడాదితో పోలిస్తే తొలి 48 గంటల్లో 21% ఎక్కువ మంది వినియోగదారులను నమోదు చేసింది.

అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు సౌరభ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. జీఎస్టీ సేవింగ్స్ ఉత్సవ్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 48 గంటల్లో కోట్లాది రూపాయల జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్‌లకు అందించామని తెలిపారు. భారతదేశ ఆర్థిక వృద్ధి ఆరు శాతం కంటే ఎక్కువగా కొనసాగుతున్న సమయంలోనే దేశీయ డిమాండ్‌ను పెంచడానికి ఈ జీఎస్టీ సంస్కరణల ప్రకటన వెలువడటం గమనార్హం.

అంతర్జాతీయంగా పెరిగిన ఒత్తిడి

మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో ట్రంప్ పరిపాలన తీసుకున్న చర్యల కారణంగా అమెరికా భారతదేశంపై 25 శాతం బేస్ టారిఫ్‌తో పాటు రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు గాను అదనంగా 25 శాతం పెనాల్టీ టారిఫ్‌ను కూడా విధించింది. ఈ విధంగా ఒకవైపు ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశీయ వినియోగం, పండుగ కొనుగోళ్లను ప్రోత్సహిస్తుండగా మరోవైపు అంతర్జాతీయ వేదికపై భారతదేశం అమెరికా టారిఫ్‌ల సవాలును ఎదుర్కోవలసి వస్తుంది.

Exit mobile version