Sensex పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 2400 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ 24000 దిగువకు చేరింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఆరంభంలోనే ఏకంగా రూ. 12 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కీలక రంగాల్లోని షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మార్చి 9వ తేదీన మార్కెట్ పరిస్థితుల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం రోజు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 3 శాతం మేర పడిపోయాయి. గతవారం నష్టాలను కొనసాగిస్తూ ఈరోజు సైతం భారీ నష్టాలతో ట్రేడింగ్ మొదలు పెట్టాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 100 డాలర్లు దాటింది. అలాగే భారతీయ రూపాయి మారకం విలువ సైతం తగ్గడం మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో సెన్సెక్స్ ఆరంభంలోనే 2400 పాయింట్లు కోల్పోయి ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 76,424 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇక నిఫ్టీ 50 సూచీ 700 పాయింట్లకు పైగా నష్టంతో 23,750 పాయింట్ల వద్దకు దిగజారింది.
మదుపరుల సంపదగా భావించే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలోని నమోది కంపెనీల మార్కెట్ విలువ ఆరంభంలోనే భారీ అమ్మకాలతో ఏకంగా రూ.12.39 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కేవలం 10 నిమిషాల్లోని మొత్తం కంపెనీల విలువ భారీకో కోసుకుపోయి రూ.437 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ఇండిగో కంపెనీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. దాదాపు 8 శాతం మేర పడిపోవడం గమనార్హం. ఆ తర్వాత టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, ఎటెర్నల్ షేర్లు దాదాపు 5 శాతం చొప్పున పతనమై నష్టాలు మూటగట్టుకున్నాయి. సెక్టార్ల వారిగా చూసుకుంటే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 5 శాతానికి పైగా పడిపోయింది. దీంతో అత్యధికంగా నష్టపోయిన సెక్టార్‌గా నిలిచింది. నిఫ్టీ ఆటో సెక్టార్ 4 శాతం పడిపోయింది. ఇక నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 3 శాతం చొప్పున పడిపోయాయి.
కారణాలు ఇవే
ఇరాన్- యూఎస్ యుద్ధంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఆయిల్ రవాణాకు ఆటంకం ఏర్పడడంతో ధరలు భారీగా పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ 30 శాతం పెరిగి బ్యారెల్ ధర 118.21 డాలర్లకు పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 27 శాతం పెరిగి బ్యారెల్ రేటు 118.22 డాలర్లకు చేరింది. 2022లో ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత ఈ స్థాయిలో ముడి చమురు ధర పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచ ఇంధన సరఫరాలో 20 శాతం హార్ముజ్ జలసంధి నుంచే రవాణా జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ ఆంక్షలు ఉండడంతో చాలా వరకు నౌకలు చిక్కుకుపోయాయి. ఆ ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోంది.
