SEBI Chief : భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ). ప్రస్తుతం సెబీ ఛైర్మన్‌గా మాధవీ పురీ బుచ్ ఉన్నారు. ఆమె చుట్టూ ఇప్పుడు వివాదాలు, ఆరోపణలు ముసురుకుంటున్నాయి. అదానీ గ్రూపునకు విదేశాల్లో ఉన్న షెల్ కంపెనీల్లో ఆమెకు వాటాలు ఉన్నాయంటూ హిండెన్ బర్గ్ ఇటీవలే సంచలన నివేదికను విడుదల చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మాధవీ పురి బుచ్ శాలరీ తీసుకుంటున్నారని రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తాజాగా ఇప్పుడు ఆమెపై సెబీ అధికారులంతా కలిసి కేంద్ర ఆర్థిక శాఖకు కంప్లయింట్ ఇచ్చారు. సెబీ అధికారులు ఆగస్టులోనే ఆర్థికశాఖకు ఫిర్యాదును అందించారు. అయితే ఆ విషయం ఆలస్యంగా ఇప్పుడు బయటికి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join
సెబీ అధికారులు చేసిన ఫిర్యాదులో మాధవీ పురీ బుచ్‌పై పలు సంచలన ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫిర్యాదులో.. ‘‘మాధవీ పురి బుచ్ మీటింగ్‌లలో మాపై పరుష పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. ఆమె అరుస్తారు. తిడతారు. బహిరంగంగా అందరి ముందే మమ్మల్ని అవమానిస్తారు’’ అని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు లేఖపై దాదాపు 500 మంది సెబీ అధికారులు సంతకం చేశారని సమాచారం. ‘‘సాధ్యం కాని లక్ష్యాలను మాకు మాధవీ పురి బుచ్ నిర్దేశిస్తున్నారు. ఉద్యోగులను నిమిష నిమిషానికి అతిగా పర్యవేక్షిస్తున్నారు. ఆమె వైఖరి వల్ల మేం మానసిక ఆరోగ్యం, వర్క్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం’’ అని అధికారులు లేఖలో ప్రస్తావించారు. ‘‘మేం యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వినడం లేదు. దీంతో ఆర్థిక శాఖను ఆశ్రయించాం’’ అని లెటర్‌లో(SEBI Chief) చెప్పారు. ‘‘గత రెండు మూడేళ్లలో సెబీపై ఉద్యోగులకు విశ్వాసం పోయింది. భయం పెరిగింది. సంస్థలో స్నేహపూర్వక పని వాతావరణం లేదు. సెబీ చీఫ్ మమ్మల్ని అణచివేస్తున్నారు’’ అని సెబీ అధికారులు ఆరోపించారు.