Zomato: డిసెంబర్ 31న డెలివరీ వర్కర్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో జోమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) వంటి సంస్థలు తమ డెలివరీ భాగస్వాముల కోసం భారీ ఆఫర్లను ప్రకటించాయి. మెరుగైన వేతనాలు, ఇన్సూరెన్స్ కోసం నిరసన తెలుపుతున్న గిగ్ వర్కర్లను శాంతింపజేయడానికి కొత్త సంవత్సరం వేళ ప్రత్యేక ఇన్సెంటివ్‌లు, పెంచిన పే-అవుట్‌లను ప్రకటించాయి. డిసెంబర్ 31 ఏడాదిలోనే అత్యంత రద్దీగా ఉండే రోజు. ఈ సమయంలో సమ్మె జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని భావించిన కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
డెలివరీ ఏజెంట్ల ఆవేదన
రోడ్లపై 14 నుండి 16 గంటలు గడిపినా తగినంత సంపాదన రావడం లేదని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని డెలివరీ ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే తామే నష్టపోవాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. మెరుగైన పని పరిస్థితులు, బీమా సౌకర్యం, వేతనాల పెంపు, సామాజిక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: వాళ్లు ఫలితం అనుభవిస్తున్నారు.. కొడాలి నాని, వంశీ పై టీడీపీ సీనియర్ లీడర్ ఫైర్
జోమాటో, స్విగ్గీ ప్రకటించిన ఆఫర్లు
న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా ఆర్డర్ల సంఖ్య విపరీతంగా ఉంటుంది. అందుకే సమ్మె ప్రభావం పడకుండా ఉండేందుకు సంస్థలు ఈ కింది ఆఫర్లను ప్రకటించాయి.
జోమాటో
పీక్ అవర్స్ (సాయంత్రం 6 నుండి రాత్రి 12 గంటల వరకు) సమయంలో ప్రతి ఆర్డర్‌పై రూ. 120 నుండి రూ. 150 వరకు సంపాదించే అవకాశం. ఆర్డర్ల సంఖ్యను బట్టి రోజంతా కలిపి దాదాపు రూ. 3000 వరకు సంపాదించవచ్చు. ప్రస్తుతానికి ఆర్డర్ క్యాన్సిలేషన్, తిరస్కరణపై విధిస్తున్న పెనాల్టీలను తొలగించారు.
స్విగ్గీ
డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలు కలిపి డెలివరీ పార్ట్‌నర్లు రూ. 10,000 వరకు సంపాదించే అవకాశం కల్పించింది. న్యూ ఇయర్ ఈవ్ లోని ఆరు గంటల పీక్ విండోలో (సాయంత్రం 6 – రాత్రి 12) రూ. 2000 వరకు అదనంగా సంపాదించవచ్చు. TGPWU, IFAT, గిగ్ వర్కర్ల యూనియన్లు సంయుక్తంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto), ఇన్‌స్టామార్ట్ (Instamart)పై కూడా ఈ సమ్మె ప్రభావం చూపే అవకాశం ఉంది.
