Reliance Income Tax: భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజురోజుకు (Reliance Income Tax) కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఈ కంపెనీ ఏడాదికి ఎంత పన్ను చెల్లిస్తుందో తెలుసా?. వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి మొత్తం రూ.1,86,440 కోట్ల పన్ను చెల్లించింది. అంతే కాదు గతేడాదితో పోల్చితే ఈ పన్ను రూ.9 వేల కోట్లకు పైగా ఉండటం విశేషం. కంపెనీ వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
మార్కెట్ క్యాప్ అత్యధికం
లిస్టెడ్ కంపెనీలన్నింటిలో రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ అత్యధికంగా ఉంది. రిలయన్స్ కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ మార్క్‌ను దాటిన భారతదేశంలో మొదటి కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఈ సంఖ్యను మరే ఇతర సంస్థ టచ్ చేయలేదు. గత ఏడాది గురించి చెప్పాలంటే గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ దాదాపు రూ. 3 లక్షల కోట్లు ఎగుమతి చేసింది.
Also Read: Australia: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. నిన్న కమిన్స్, నేడు హేజిల్‌వుడ్!
వార్షిక నివేదికలో ముఖేష్ అంబానీ ఏం చెప్పారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని, MD ముఖేష్ అంబానీ వార్షిక నివేదికలో ఇలా పేర్కన్నారు. గత దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక దృష్టాంతంలో భారతదేశం ప్రాముఖ్యత అనేక రెట్లు పెరిగింది. అస్థిరత, అనిశ్చితితో కూడిన ఈ ప్రపంచంలో భారతదేశం స్థిరత్వం, శ్రేయస్సుకు చిహ్నంగా ప్రకాశిస్తోంది. 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషి ఫలితంగా అన్ని రంగాల్లోనూ బలమైన వృద్ధిని సాధించింది. భారతదేశం, భారతీయత ఈ స్పూర్తి రిలయన్స్‌ను నిరంతరం ఆవిష్కరణలు చేయడానికి.. ప్రతి ప్రయత్నంలో శ్రేష్ఠతను సాధించడానికి ప్రేరేపిస్తుంది. రిలయన్స్ కుటుంబం భారతదేశ వృద్ధి కథలో భాగం కావడం, కంపెనీ అద్భుతమైన వృద్ధికి దోహదం చేయడం గర్వించదగ్గ విషయం అని ఆయన తెలిపారు.