Cash Withdrawals: స్మార్ట్‌ఫోన్‌తో నగదును విత్‌డ్రా (Cash Withdrawals) చేసుకోవడం ఇప్పుడు మరింత సులభం కానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దీనికోసం ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. త్వరలోనే దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా బిజినెస్ కరెస్పాండెంట్ (BC) అవుట్‌లెట్స్ వద్ద యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా ప్రజలు నగదును విత్‌డ్రా చేసుకోగలుగుతారు. ఈ సదుపాయాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఎన్‌పీసీఐ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుమతి కోరినట్లు సమాచారం.
విత్ డ్రా లిమిట్ ఎంత?
ప్రస్తుతం, యూపీఐ ఆధారిత నగదు విత్‌డ్రాయల్ సదుపాయం కొన్ని ఎంపిక చేసిన ఏటీఎంలలో లేదా కొన్ని దుకాణాలలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిపై నిర్దిష్ట పరిమితులు కూడా ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లో ప్రతి లావాదేవీకి రూ. 1,000, గ్రామాల్లో రూ. 2,000 వరకు మాత్రమే నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంది. కానీ, ఎన్‌పీసీఐ ప్రతిపాదించిన కొత్త ప్రణాళిక ప్రకారం, బీసీ అవుట్‌లెట్స్‌లో ప్రతి లావాదేవీకి రూ. 10,000 వరకు నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: Peter Navarro: భారత్-అమెరికా వాణిజ్య వివాదంపై ట్రంప్ సలహాదారు సంచలన వ్యాఖ్యలు!
బిజినెస్ కరెస్పాండెంట్స్ ఎవరు?
బిజినెస్ కరెస్పాండెంట్స్ అంటే సుదూర ప్రాంతాలలో, ముఖ్యంగా ఏటీఎం సౌకర్యాలు లేని చోట్ల బ్యాంకింగ్ సేవలను అందించే స్థానిక ఏజెంట్లు. ఈ ప్రాంతాలలో వీరు బ్యాంకు శాఖల విస్తరణగా పనిచేస్తారు. ఒక దుకాణదారుడు, స్వచ్ఛంద సంస్థ (NGO) లేదా ఒక వ్యక్తి కూడా బిజినెస్ కరెస్పాండెంట్ కావచ్చు. గతంలో కూడా ప్రజలు ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ మరియు డెబిట్ కార్డుల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వీరి సేవలను ఉపయోగించుకునేవారు.
యూపీఐ క్యూఆర్ కోడ్ విధానం
యూపీఐ ఆధారిత క్యూఆర్ కోడ్ విధానం అమల్లోకి వస్తే వినియోగదారులు తమ ఫోన్‌లోని ఏదైనా యూపీఐ యాప్‌ను ఉపయోగించి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ కింద లక్షలాది చిన్న సర్వీస్ పాయింట్‌లు లేదా దుకాణదారులకు క్యూఆర్ కోడ్‌లు ఇవ్వబడతాయి. ఈ సదుపాయాన్ని బిజినెస్ కరెస్పాండెంట్స్‌కు కూడా ఇవ్వాలని ఎన్‌పీసీఐ రిజర్వ్ బ్యాంక్‌ను కోరింది.
ఈ కొత్త విధానం వల్ల వేలిముద్రల ప్రమాణీకరణలో ఇబ్బందులు పడే వారికి లేదా డెబిట్ కార్డులను ఉపయోగించడానికి ఇష్టపడని వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం వినియోగదారులు మైక్రో ఏటీఎంలలో కార్డును ఉపయోగించి డబ్బు విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఇకపై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సులభంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోగలుగుతారు. ఎన్‌పీసీఐ 2016లో యూపీఐని ప్రారంభించింది.