LPG Crisis: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గ్యాస్ ఏజెన్సీల బయట ప్రజలు భారీ క్యూలలో బారులు తీరుతున్నారు. ఈ కొరత ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. గంటల తరబడి నిరీక్షణ సామాన్యులకు శాపంగా మారుతోంది. తాజాగా పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలో గ్యాస్ సిలిండర్ కోసం క్యూలో నిలబడిన ఒక వృద్ధుడు గుండెపోటుతో మరణించడం కలకలం రేపుతోంది.
బర్నాలాలో విషాదం
అందిన సమాచారం ప్రకారం.. బర్నాలా జిల్లాలోని షైనా గ్రామానికి చెందిన 66 ఏళ్ల భూషణ్ కుమార్ మిట్టల్ (తండ్రి దేవరాజ్ మిట్టల్) ఈ ఉదయం 8 గంటల నుండి గ్యాస్ సిలిండర్ కోసం వేచి చూస్తున్నారు. సిలిండర్ తీసుకోవడానికి ఆయన క్యూలో 25వ స్థానంలో ఉన్నారు. సుమారు రెండు గంటల పాటు నిరీక్షించిన తర్వాత, క్యూలో తన సిలిండర్‌పైనే కూర్చుని ఉండగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు.
Also Read: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?!
ప్రభుత్వాలదే బాధ్యత.. కాంగ్రెస్ విమర్శలు
ఈ ఘటనపై భదౌడ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు సుఖ్వీందర్ సింగ్ ధాలివాల్ తీవ్రంగా స్పందించారు. ఈ మరణానికి కేంద్ర ప్రభుత్వమే నేరుగా బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు. మృతుడు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని, గ్యాస్ కోసం ప్రజలు ప్రాణాలు వదిలే పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. బాధితుడి కుటుంబానికి కేంద్ర, పంజాబ్ ప్రభుత్వాలు వెంటనే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కఠిన వైఖరి
పరిస్థితి తీవ్రతను గమనించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రంగంలోకి దిగారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని ఆయన విజ్ఞప్తి చేశారు. సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసేవారు, బ్లాక్ మార్కెట్ చేసేవారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు (DC) సీఎం ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ పంపిణీని కేవలం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే నిర్వహించాలని యంత్రాంగం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం సర్వర్ సమస్యల కారణంగా ఆన్‌లైన్ ప్రక్రియ కూడా మందకొడిగా సాగుతుండటంతో వినియోగదారుల ఇబ్బందులు రెట్టింపు అవుతున్నాయి.
