- ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కీలక నిర్ణయం
- PUC సర్టిఫికేట్ లేకపోతే నో పెట్రోల్
- డిసెంబర్ 18 నుంచి అమలు
Petrol: ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు ఎవరికీ తెలియని విషయం కాదు. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్న మొదటి కీలక నిర్ణయం ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్’ (PUC) సర్టిఫికేట్ లేని వాహనాలపై ఆంక్షలు విధించడం. ఇకపై మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్ లేకపోతే మీరు ఏ పెట్రోల్ బంక్‌లోనూ పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకోలేరు. సర్టిఫికేట్ చూపించని వాహనదారులకు ఇంధనం నింపకూడదని ఢిల్లీ ప్రభుత్వం కఠినమైన నిబంధనలను జారీ చేసింది.
రేపటి నుంచే కొత్త నిబంధనలు అమలు
ఈ కొత్త నిబంధనలు రేపు అనగా డిసెంబర్ 18 నుండి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయవద్దని స్పష్టం చేశారు. మీరు ఇంధనం నింపుకోవడానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికేట్ దగ్గర ఉంచుకోవాలి. పెట్రోల్ బంక్ సిబ్బందికి కూడా దీనిపై కఠిన ఆదేశాలు వెళ్లాయి.
Also Read: ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!
ట్రాఫిక్ పోలీసుల నిఘా – భారీగా చలాన్లు
మరోవైపు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కూడా కాలుష్య నియంత్రణపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించిన 8.66 లక్షలకు పైగా వాహనాలకు చలాన్లు విధించారు. గతంలో కూడా ఢిల్లీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాలుష్యం నుండి కొంత ఉపశమనం లభించింది.
PUC సర్టిఫికేట్ అంటే ఏమిటి? ఎక్కడ లభిస్తుంది?
- వాహనం నుండి వెలువడే పొగ కాలుష్య నియమాలకు లోబడి ఉందో లేదో ఈ సర్టిఫికేట్ ధృవీకరిస్తుంది.
- ఢిల్లీలోని 10 జోన్లలో దాదాపు 966 రిజిస్టర్డ్ PUC కేంద్రాలు ఉన్నాయి.
- ఈ కేంద్రాలు ఎమిషన్ నార్మ్స్ పాటిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ‘పొల్యూషన్ లెవల్ టెస్ట్ ఇన్‌స్పెక్టర్లు’ అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహిస్తుంటారు.
- కాబట్టి మీరు ఢిల్లీలో వాహనం నడుపుతున్నట్లయితే ఇబ్బందులు పడకుండా ఉండటానికి వెంటనే మీ వాహనానికి కాలుష్య పరీక్ష చేయించుకుని సర్టిఫికేట్ సిద్ధంగా ఉంచుకోండి.
