IndiGo Vs Mahindra : ఆటోమొబైల్ కంపెనీ ‘మహీంద్రా ఎలక్ట్రిక్’, విమానయాన సంస్థ ‘ఇండిగో’ మధ్య లీగల్ వార్ మొదలైంది. మహీంద్రా ఎలక్ట్రిక్ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన ఎలక్ట్రిక్ కార్ల పేర్లలో ‘6ఈ’ అనే పదాన్ని వినియోగించారు. ఈ పదాన్ని వాడటంపై అభ్యంతరం తెలుపుతూ ‘ఇండిగో’ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ‘6ఈ’ పదాన్ని వాడటం ద్వారా మహీంద్రా కంపెనీ ట్రేడ్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ ఇవాళ ఈ కేసును విచారించారు. అయితే ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. తాను ఆ కేసును విచారించలేనని స్పష్టం చేశారు. తదుపరిగా కేసు విచారణ డిసెంబర్ 9న జరిగే ఛాన్స్ ఉంది.ఈ వ్యవహారంలో తమతో సంప్రదింపులు జరిపేందుకు మహీంద్రా కంపెనీ ప్రయత్నించిందని ఇండిగో తరఫు సీనియర్ న్యాయవాది సందీప్ సేథి తెలిపారు.
Also Read :India A Laboratory : ‘‘భారత్ ఒక ప్రయోగశాల’’ అంటున్న బిల్ గేట్స్.. భారత నెటిజన్ల ఆగ్రహం
ఇండిగో కంపెనీ ‘6ఈ’(IndiGo Vs Mahindra) బ్రాండింగ్‌ను వివిధ సేవలకు వాడుకుంటోంది. ‘6ఈ’ పేరుతో విమాన సర్వీసులను నడుపుతోంది. వీటితో పాటు 6ఈ ఫ్లెక్స్, 6ఈ ప్రైమ్, 6ఈ లింక్ పేరిట వివిధ రకాల సేవలను కూడా అందిస్తోంది. మహీంద్రా ఎలక్ట్రిక్ కంపెనీ ఇటీవలే ‘బీఈ 6ఈ’ మోడల్ పేరుతో ఒక కారును విడుదల చేసింది. దీని పేరులో ‘6ఈ’ అనే పదం ఉండటంపై ఇండిగో కంపెనీ అభ్యంతరం తెెలుపుతోంది. ఈ కారు వచ్చే ఏడాది జనవరి నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.