Site icon HashtagU Telugu

India Forex Reserve: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుదల!

India Forex Reserve

India Forex Reserve

India Forex Reserve: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు (India Forex Reserve) అక్టోబర్ 3తో ముగిసిన వారంలో 276 మిలియన్ అమెరికన్ డాలర్లు తగ్గి 699.96 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ అంకె 700 బిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయి కంటే స్వల్పంగా దిగువన ఉంది. అంతకుముందు వారంలో కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2.334 బిలియన్ డాలర్లు తగ్గి 700.236 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వరుసగా రెండో వారం దేశ ఫారెక్స్ నిల్వలు తగ్గడం గమనార్హం. ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets – FCA) తగ్గడం వల్ల ఈ ప్రభావం కనిపించింది.

విదేశీ కరెన్సీ ఆస్తులు కూడా తగ్గాయి

సమీక్షించిన వారంలో విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (FCA) కూడా 4.049 బిలియన్ అమెరికన్ డాలర్లు తగ్గి 577.708 బిలియన్ డాలర్లకు చేరాయి. దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అమెరికన్ డాలర్ మాత్రమే కాకుండా యూరో, పౌండ్ స్టర్లింగ్, యెన్ వంటి ఇతర దేశాల కరెన్సీలు కూడా ఉంటాయని గమనించాలి. డాలర్‌తో పోలిస్తే ఈ కరెన్సీల విలువ పెరిగినా, తగ్గినా దాని ప్రభావం FCAపై ఉంటుంది. ఇదే వారంలో ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (SDR) 2.5 కోట్ల డాలర్లు పెరిగి 18.814 బిలియన్ డాలర్లకు చేరాయి.

Also Read: Damage Kidney: ‎వామ్మో.. మనం తరచుగా తీసుకునే ఈ ఫుడ్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయా.. చాలా డేంజర్!

భారత గోల్డ్ రిజర్వ్స్‌లో పెరుగుదల

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద దేశ రిజర్వ్ నిల్వలు ఈ వారం 40 లక్షల డాలర్లు స్వల్పంగా తగ్గి 4.6669 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ భారత్ అత్యధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అక్టోబర్ 3తో ముగిసిన వారంలో భారత్ గోల్డ్ రిజర్వ్స్‌లో (బంగారు నిల్వలు) మాత్రం పెరుగుదల కనిపించింది. ఇది 3.753 బిలియన్ డాలర్లు పెరిగి 98.77 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది.

పాకిస్తాన్ ఖజానాలో స్వల్ప పెరుగుదల

ఇక పొరుగు దేశం పాకిస్తాన్ విషయానికి వస్తే గురువారం విడుదలైన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 3, 2025 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) ఫారెక్స్ రిజర్వ్‌లో 2 కోట్ల డాలర్ల పెరుగుదల నమోదైంది. దీనితో ఆ దేశ నిల్వలు 14.42 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత వారంలో కూడా పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2.1 కోట్ల డాలర్లు పెరిగాయని SBP తన ప్రకటనలో తెలిపింది.

Exit mobile version