Site icon HashtagU Telugu

Rule Changes: ఏప్రిల్ 1 నుంచి మారే కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలు ఇవే.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిందే!

Rule Changes

Rule Changes

Rule Changes: కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం, సెబీ (భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్) కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు (Rule Changes) తీసుకున్నాయి. ఇవి సామాన్య పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయి. ఈ మార్పులు ఆదాయం, పొదుపు, పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ కొత్త నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం.

కొత్త ఫండ్ ఆఫర్ (NFO) కోసం కఠిన నియమాలు

సెబీ కొత్త ఫండ్ ఆఫర్ (NFO) నియమాలను కఠినతరం చేసింది. ఇప్పుడు ఎసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCలు) యూనిట్ అలాట్‌మెంట్ తేదీ నుంచి 30 పని దినాల్లో సేకరించిన మూలధనాన్ని పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ ఈ వ్యవధిలో పెట్టుబడి పెట్టలేకపోతే పెట్టుబడి కమిటీ అనుమతితో మరో 30 రోజుల సమయం పొడిగించవచ్చు. అయితే, ఈ అదనపు సమయంలో కూడా ఫండ్ పెట్టుబడి పెట్టకపోతే కొత్త పెట్టుబడిదారులకు పెట్టుబడి ఆపివేయబడుతుంది. ప్రస్తుత పెట్టుబడిదారులు ఎలాంటి జరిమానా లేకుండా తమ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఈ మార్పుల లక్ష్యం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మెరుగైన ఫండ్ నిర్వహణ, పారదర్శకతను తీసుకురావడం.

స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (SIF), డిజిలాకర్ సౌలభ్యం

సెబీ పెట్టుబడిదారుల కోసం ‘స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్’ (SIF) అనే కొత్త ఫండ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇది మ్యూచువల్ ఫండ్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్ (PMS) కాంబినేష‌న్‌గా ఉంటుంది. దీనిలో పెట్టుబడి పెట్టడానికి కనీసం 10 లక్షల రూపాయలు అవసరం. ఈ సౌలభ్యం గత మూడు సంవత్సరాల్లో సగటున 10,000 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులను నిర్వహించిన AMCలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే, పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం డిజిలాకర్‌ను వారి డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్ ఖాతాలతో అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల పెట్టుబడి సంబంధిత పత్రాలు సురక్షితంగా ఉంటాయి. అవసరమైతే నామినీలు కూడా వీటిని సులభంగా చూడగలరు.

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)తో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట

ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ప్రారంభం కానుంది. ఈ పథకం జాతీయ పెన్షన్ విధానం (NPS) కింద పనిచేసే ఉద్యోగుల కోసం రూపొందించబడింది. ఈ పథకం ప్రకారం 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సేవ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వారి చివరి 12 నెలల సగటు బేసిక్ జీతంలో 50% పెన్షన్‌గా అందుతుంది. దీనివల్ల వారికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కలుగుతుంది.

Also Read: Rohit Sharma: రోహిత్ ఫామ్‌పై విమ‌ర్శ‌లు.. రూ. 16.30 కోట్లు వృథానేనా?

టాక్స్, క్రెడిట్ కార్డ్ సంబంధిత మార్పులు

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను నియమాలు మారనున్నాయి. 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రకారం.. కొత్త టాక్స్ విధానంలో పన్ను రహిత ఆదాయ పరిమితిని 7 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయలకు పెంచారు. దీనివల్ల ముఖ్యంగా మధ్యతరగతి వారికి ప్రయోజనం కలుగుతుంది. వారి పొదుపు పెరుగుతుంది. టాక్స్ ఫైలింగ్‌ను సులభతరం చేయడానికి, డిజిటల్‌గా మార్చడానికి ప్రభుత్వం కొత్త సాంకేతికతలను కూడా అవలంబించింది.

తద్వారా ప్రజలు ఇబ్బంది లేకుండా తమ రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. అలాగే కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు తమ రివార్డ్ పాయింట్ విధానంలో మార్పులు చేస్తున్నాయి. SBI కార్డ్ తన SimplyCLICK, ఎయిర్ ఇండియా SBI ప్లాటినం కార్డ్‌ల రివార్డ్ పాయింట్లలో మార్పులు చేసింది. అలాగే విస్తారా, ఎయిర్ ఇండియా విలీనం తర్వాత యాక్సిస్ బ్యాంక్ తన విస్తారా క్రెడిట్ కార్డ్‌ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను తొలగించింది. ఈ మార్పులన్నీ కస్టమర్ల అవసరాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చేయబడ్డాయి.