Megha Engineering: హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కంపెనీ మరో కీలకమైన కాంట్రాక్టును దక్కించుకుంది. ఇప్పటివరకు నిర్మాణ రంగంపై పూర్తి ఫోకస్ పెట్టిన మేఘా.. ఇప్పుడు ఏకంగా న్యూక్లియర్ పవర్ రంగపు కాంట్రాక్టును కైవసం చేసుకుంది. రూ.12,800 కోట్ల భారీ పెట్టుబడితో కర్ణాటక రాష్ట్రంలోని కైగా వద్ద 700 మెగావాట్ల ఎలక్ట్రిక్ సామర్థ్యం కలిగిన రెండు అణు రియాక్టర్లను మేఘా నిర్మించనుంది. కైగా అణు విద్యుత్ కేంద్రంలోని 5, 6 అణు రియాక్టర్లను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్) కోసం మేఘా నిర్మించనుంది.
Also Read :India Vs Pak : భారత ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్.. కీలక ప్రకటన ?
ఎన్పీసీఐఎల్ అతిపెద్ద ఆర్డర్ ఇదే
ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో ఎంఈఐఎల్ ఈ అణు రియాక్టర్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. ఇప్పటివరకు ఎన్పీసీఐఎల్ ఏకమొత్తంగా ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్ ఇదే కావడం గమనార్హం. బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీవంటి ఇతర ప్రముఖ బిడ్డర్లతో పోటీ పడి ఈ కాంట్రాక్టును మేఘా(Megha Engineering) దక్కించుకోవడం విశేషం. ఇవాళ (బుధవారం) ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎన్పీసీఐఎల్ సీనియర్ అధికారుల నుంచి పర్ఛేజ్ ఆర్డర్‌ను మేఘా డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సి.హెచ్. సుబ్బయ్య అందుకున్నారు.
ప్రపంచంలోనే తొలి థోరియం అణు రియాక్టర్ షురూ
ప్రపంచంలోనే తొలి థోరియం ఆధారిత అణు రియాక్టర్‌ను చైనా విజయవంతంగా ప్రారంభించింది. గన్సు ప్రావిన్స్‌లోని వుయ్ నగరంలోని మారుమూల గోబీ ఎడారిలో ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు. 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో 2023 అక్టోబరులో థోరియం మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ (TMSR)ను చైనా రూపొందించింది. 2011 నుంచి దాదాపు 444 మిలియన్ల డాలర్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. థోరియం నిల్వలలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రపంచ థోరియం నిల్వలలో 25 శాతం భారత్‌లోనే ఉన్నాయి. భారత్‌లోని పరిమితమైన యురేనియం నిల్వలు, అత్యధిక థోరియం నిల్వలను లక్ష్యంగా చేసుకొని డాక్టర్ హోమీ బాబా భారతదేశ అణుశక్తి రోడ్‌మ్యాప్‌ను తయారు చేశారు. అందుకే భారత్‌లో థోరియంపై పరిశోధన 1950వ దశకంలోనే మొదలైంది. జనవరి 2025 నాటికి భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం 8,180 మెగావాట్లుగా ఉంది. 2032 నాటికి దీనిని 22,480 మెగావాట్లకు పెంచాలనే ప్రణాళికలు ఉన్నాయి.