Trump Tariffs: వాణిజ్య ఒప్పందాలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Tariffs) భారతదేశంపై విధించిన భారీ సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. గురువారం నుంచి 25 శాతం సాధారణ సుంకం అమల్లోకి రాగా.. ఆగస్టు 27 నుంచి రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై మరో 25 శాతం అదనపు సుంకం విధించనున్నారు. దీంతో భారత్‌పై మొత్తం అమెరికా సుంకాలు 50 శాతానికి చేరనున్నాయి.
ఏ రంగాలపై ఎంత ప్రభావం?
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో భారత్ 86.5 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేయగా, 45.3 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు పెరిగిన సుంకాల కారణంగా భారతీయ ఎగుమతులు 40 నుంచి 50 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అత్యధిక ప్రభావం పడే కీలక రంగాలు
- వస్త్ర పరిశ్రమ (టెక్స్‌టైల్): 10.2 బిలియన్ డాలర్ల ఎగుమతులు.
- వజ్రాలు, ఆభరణాలు: 12 బిలియన్ డాలర్ల ఎగుమతులు.
- తోలు ఉత్పత్తులు: 1.18 బిలియన్ డాలర్ల ఎగుమతులు.
- సముద్ర రొయ్యలు: 2.24 బిలియన్ డాలర్ల ఎగుమతులు.
- రసాయనాలు (కెమికల్స్): 2.34 బిలియన్ డాలర్ల ఎగుమతులు.
- ఎలక్ట్రికల్ మెషినరీ: 9 బిలియన్ డాలర్ల ఎగుమతులు.
Also Read: Varalakshmi Vratam: రేపే వరలక్ష్మి వ్రతం.. పూజా విధానం ఇదే!
పరిశ్రమల ఆందోళన
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అనేక సవాళ్లతో పోరాడుతున్న భారతీయ టెక్స్‌టైల్ పరిశ్రమకు ఇది ఒక పెద్ద దెబ్బ అని పేర్కొంది. గతంలో 59 శాతం వృద్ధిని నమోదు చేసిన ఈ రంగం ఇప్పుడు క్షీణతను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొత్తగా విధించిన సుంకాల కారణంగా అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువులు ఖరీదైనవిగా మారతాయి. దీంతో చైనా, వియత్నాం వంటి పోటీ దేశాల నుంచి వచ్చే చౌక ఉత్పత్తులకు అమెరికన్ వినియోగదారులు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. దీనివల్ల భారతీయ ఎగుమతులకు భారీగా నష్టం కలుగుతుంది.
సముద్ర రొయ్యల ఎగుమతిదారులు కూడా ఈ సుంకాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కతాకు చెందిన ఒక ఎగుమతిదారు ప్రకారం.. కొత్త సుంకాలతో అమెరికాలో రొయ్యల ధరలు విపరీతంగా పెరుగుతాయి. మెగ్గా మోడా ఎండీ యోగేష్ గుప్తా మాట్లాడుతూ.. భారతీయ రొయ్యలపై ఇప్పటికే 2.49 శాతం యాంటీ-డంపింగ్ డ్యూటీ, 5.77 శాతం కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ ఉన్నాయని, ఇప్పుడు అదనంగా 25 శాతం సుంకం విధించడంతో మొత్తం సుంకం 33.26 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పోటీలో నిలబడటం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా మెషినరీపై 51.3 శాతం, ఫర్నిచర్‌పై 52.3 శాతం, ఆభరణాలపై 51.1 శాతం సుంకం భారతీయ ఎగుమతిదారులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. అమెరికా ఈ చర్యల పట్ల భారత ప్రభుత్వం ఎలాంటి ప్రతిస్పందన చూపిస్తుందో వేచి చూడాలి.