Gautam Adani: అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అదానీ గ్రూప్, మొత్తం పారిశ్రామిక రంగాన్ని కుదిపేసింది. ఈ నివేదిక వల్ల గ్రూప్‌కు భారీ ఆర్థిక నష్టం జరిగింది. అయితే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుండి క్లీన్ చిట్ లభించిన తర్వాత అదానీ గ్రూప్ (Gautam Adani) షేర్లు వేగంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ చైర్మన్, వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ షేర్ హోల్డర్లకు లేఖ రాసి తన స్పందనను తెలిపారు.
అదానీ షేర్‌హోల్డర్లకు రాసిన లేఖ
గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. హిండెన్‌బర్గ్ నివేదిక ఉద్దేశ్యం గ్రూప్‌ను బలహీనపరచడమే. కానీ నిజానికి ఇది గ్రూప్‌ను మరింత బలోపేతం చేసిందని అన్నారు. సోషల్ మీడియాలో హిండెన్‌బర్గ్ దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేఖలో అదానీ తమ గ్రూప్ పారదర్శకత, సుపరిపాలన (Governance) పట్ల కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. “జనవరి 24, 2023 ఉదయం ఎల్లప్పుడూ గుర్తుంటుంది. ఆ రోజు భారత మార్కెట్లు దలాల్ స్ట్రీట్‌కు మించి ప్రతిధ్వనించే హెడ్‌లైన్స్‌తో తెరుచుకున్నాయి” అని ఆయన అన్నారు.
Also Read: Smartphones: పాత స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!
“భారతీయ కలలకు అంతర్జాతీయ సవాలు”
అదానీ తన లేఖలో ఇలా రాశారు. ఈ నివేదిక కేవలం అదానీ గ్రూప్‌పై విమర్శ మాత్రమే కాదు. ప్రపంచ స్థాయిలో కలలు కనే భారతీయ సంస్థల ధైర్యాన్ని సవాలు చేయడమే. ఇది మా పరిపాలన, ఉద్దేశ్యం, భారతీయ కంపెనీలు ప్రమాణాలు, ఆశయాల విషయంలో ప్రపంచానికి నాయకత్వం వహించగలవనే ఆలోచనను కూడా ప్రశ్నించింది అని రాసుకొచ్చారు.
సెబీ నిర్ణయం “సత్యమేవ జయతే”
గత వారం అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలను సెబీ కొట్టివేసింది. దీనిపై అదానీ మాట్లాడుతూ..సెబీ స్పష్టమైన, తుది నిర్ణయంతో సత్యమే గెలిచింది. మమ్మల్ని బలహీనపరచాలని ఉద్దేశించినదే మా పునాదిని మరింత పటిష్టం చేసింది. సత్యమేవ జయతే – సత్యమే గెలుస్తుంది అని తెలిపారు.
షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో గౌతమ్ అదానీ ఇది కేవలం ఒక నియంత్రణ అనుమతి కంటే ఎక్కువ అని అన్నారు. ఇది అదానీ గ్రూప్ ఎల్లప్పుడూ పనిచేస్తున్న పాలన, పారదర్శకత, సమగ్రతకు ఒక శక్తివంతమైన ధృవీకరణ అని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో మా ప్రదర్శనలో మా నిజమైన స్థితిస్థాపకత స్పష్టమవుతుంది. కేవలం మాటల్లో కాదు అని ఆయన చెప్పారు.
