Site icon HashtagU Telugu

Petrol- Diesel: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయా? క్లారిటీ ఇదే!

Indian Companies

Indian Companies

Petrol- Diesel: పెట్రోల్, డీజిల్ ధరల (Petrol- Diesel) పెరుగుదల గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎక్సైజ్ సుంకంలో 2 శాతం పెంపును ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని తెలిపింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు ఎక్సైజ్ సుంక రేట్లలో పెంపు జరుగుతుందని తెలిపాయి. అయితే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదు. రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ లీటరుకు 94 రూపాయలు, డీజిల్ లీటరుకు 87 రూపాయలుగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు 19.90 రూపాయలు, డీజిల్ పై లీటరుకు 15.80 రూపాయలు ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తోంది. ఈ పెంపు తర్వాత పెట్రోల్‌పై లీటరుకు 21.90 రూపాయలు, డీజిల్ పై లీటరుకు 17.80 రూపాయలు ఎక్సైజ్ సుంకం అమలులోకి వస్తుంది.

ఎక్సైజ్ సుంకం అంటే ఏమిటి?

ఎక్సైజ్ సుంకం అనేది ఒక రకమైన పన్ను. దీనిని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై విధిస్తుంది. ఇది ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది. 2014లో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటరుకు 9.48 రూపాయలు,డీజిల్ పై లీటరుకు 3.56 రూపాయలుగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం దీనిని చాలాసార్లు పెంచింది. ఇప్పుడు ప్రభుత్వం సామాన్య ప్రజలపై తమ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది.

Also Read: LPG cylinder price Hike : దేశ వ్యాప్తంగా గ్యాస్‌ ధరలు పెంపు

2021లో ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు 27.90 రూపాయలు, డీజిల్ పై లీటరుకు 21.80 రూపాయలు ఎక్సైజ్ సుంకం విధించింది. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఊరటనిస్తూ పెట్రోల్ ధరల్లో 8 రూపాయలు, డీజిల్ ధరల్లో 6 రూపాయలు తగ్గించినట్లు ప్రకటించింది. పెట్రోల్-డీజిల్ బేస్ ధర గురించి చెప్పాలంటే.. భారతదేశంలో ఇది లీటరుకు 32 రూపాయలుగా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ వసూలు చేస్తాయి

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్‌పై తమ తమ విధానాల ప్రకారం వ్యాట్, సెస్ వసూలు చేస్తాయి. దీని వల్ల ధరలు మూడు రెట్లు పెరుగుతాయి. ప్రస్తుతం ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 104.21 రూపాయలు, చెన్నైలో 100.75 రూపాయలు, కోల్‌కతాలో 103.94 రూపాయలుగా ఉంది. అదే విధంగా ముంబైలో డీజిల్ లీటరుకు 92.15 రూపాయలు, కోల్‌కతాలో 90.76 రూపాయలు, చెన్నైలో 92.34 రూపాయలుగా ఉంది.

 

Exit mobile version