Gold బంగారం, వెండి ధరలు మరింత పతనం అవుతున్నాయి. కిందటి వారం శుక్ర, శనివారాల్లో ఒక్కసారిగా క్రాష్ అవగా.. కిందటి రోజు ఆదివారం ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు 5 శాతం వరకు పతనం అయ్యాయి. దీంతో ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు.
పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఆల్ టైమ్ గరిష్ఠాల వద్ద ఒక్కసారిగా మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో.. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు దిగొస్తున్న సంగతి తెలిసిందే. కిందటి వారం గురువారం, శుక్రవారం రాత్రి వేళల్లో భారీగా క్రాష్ అయిన సంగతి తెలిసిందే. బంగారం ధర 15 శాతానికిపైగా.. వెండి ధర 30 శాతానికిపైగా కరెక్షన్‌కు గురయ్యాయి. దీంతో దీనికి అనుగుణంగానే.. వెంటనే దేశీయ మార్కెట్లలో బంగారం ధర 2 రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 16 వేలకుపైగా తగ్గింది. ఇదే సమయంలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ. 1.05 లక్షలు పతనమైంది. శనివారం, ఆదివారం.. ఇంటర్నేషనల్ మార్కెట్లకు సెలవు. అయితే.. ఆదివారం రోజు బడ్జెట్ సందర్భంగా కమొడిటీ మార్కెట్లు పనిచేయగా.. బంగారం, వెండి ధరలు అక్కడ భారీగా పతనం అయ్యాయి.
మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలో (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ ధర 5 శాతం వరకు తగ్గి రూ. 1.43 లక్షల స్థాయికి పడిపోయింది. ఇక వెండి ఫ్యూచర్స్ ధర ఏకంగా 9 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టి రూ. 3 లక్షలకు దిగువకు కూడా చేరింది. ఇది ఇవాళ దేశీయ మార్కెట్లలో మనకు స్పష్టం కనిపిస్తుందని చెప్పొచ్చు.
ఇదే సమయంలో ఫిబ్రవరి 2న ఇంటర్నేషనల్ మార్కెట్లలో మళ్లీ బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10 గ్రాములు) 4,880 డాలర్ల స్థాయిలో ఉండేది. ఇప్పుడు అది 5 శాతం వరకు తగ్గి 4,700 డాలర్ల దిగువకు చేరింది. ఇక సిల్వర్ రేటు 85 డాలర్ల నుంచి 5 శాతం పతనంతో 80 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. ఈ అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా.. సోమవారం ఉదయం 10 గంటలకు దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు మళ్లీ దిగిరానున్నాయని చెప్పొచ్చు.
ప్రస్తుతం దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు తులం రూ. 1,47,200 స్థాయిలో ఉంది. 2 రోజుల్లో రూ. 16 వేలకుపైగా పతనమైంది. 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే 10 గ్రాములకు హైదరాబాద్ మార్కెట్లో రూ. 1,60,580 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర ప్రస్తుతం కేజీకి హైదరాబాద్ నగరంలో రూ. 3.20 లక్షల వద్ద ఉంది. ఇవాళ ఇది రూ. 3 లక్షల దిగువకు చేరే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 10 గంటల తర్వాత ధరలు మళ్లీ మారతాయని గుర్తుంచుకోవాలి. అందుకు అనుగుణంగానే జువెల్లరీలు కూడా ధరల్ని సవరిస్తాయి.
