Gold Rate పసిడి ప్రియులకు ఎగిరిగంతేసే వార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కరోజే ఏకంగా రూ.10 వేల మేర దిగివచ్చింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నా పసిడి రేట్లు భారీగా పడిపోతుండడం గమనార్హం. ఇక కిలో వెండి రేటు ఇవాళ ఏకంగా రూ.20 వేల మేర పడిపోయింది. ఈ క్రమంలో మార్చి 24వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం గోల్డ్ రేటు, కిలో వెండి రేటు ఎంతకు దిగివచ్చాయో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇంతకు మించిన మంచి సమయం రాదనే చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. వరుసగా ఐదో రోజూ ధరలు దిగివచ్చాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా పరిస్థితులను ఎవరూ ఊహించలేకపోతున్నారు. యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి బంగారం, వెండి వంటి విలువైన లోహాలు సురక్షితమైన పెట్టుబడి హోదాను కోల్పోతున్నాయి. అటు అమెరికా డాలర్ విలువ పెరగడం, బాండ్ ఈల్డ్స్ హైరిటర్న్స్ ఇస్తుండడం, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం వంటి కారణాలు బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు దోహదం చేస్తున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధం జరుగుతున్నా బంగారం ఆకర్షణ కోల్పోయి ధరలు భారీ స్థాయిలో పతనమవుతున్నాయంటున్నారు. ఈ క్రమంలో మార్చి 24వ తేదీన తులం బంగారం రేటు ఏకంగా రూ.10 వేలకు పైగా దిగివచ్చింది. కిలో వెండి రేటు రూ.20 వేల మేర పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా పడిపోతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఈరోజు 108 డాలర్ల మేర తగ్గింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4382 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు కాస్త పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు 0.82 శాతం వృద్ధితో 68.43 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఏకంగా రూ.10,320 మేర దిగిరావడం గమనార్హం. దీంతో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,35,650 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల 916 ప్యూరిటీ గల బంగారం ధర 10 గ్రాములకు రూ.9,450 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ. 1,24,350 వద్దకు దిగివచ్చి అమ్ముడవుతోంది.
రూ.20 వేలు తగ్గిన వెండి
బంగారంతో పాటు వెండి రేటు సైతం కుప్పకూలుతోంది. ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి దాదాపు రూ.2 లక్షల మేర పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.20,000 దిగివచ్చింది. దీంతో ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ. 2,30,000 వద్ద ట్రేడవుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్చి 24వ తేదీ మంగళవారం రోజున ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మధ్యాహ్నం వరకు మారిపోతుంటాయి. కొనుగోలు చేయాలనుకునే వారు స్థానికంగా ఉండే ధరలను ఖరీదు చేసే ముందే తెలుసుకోవడం మంచిది.
