Gold Price: బంగారం ధర 2025 సంవత్సరంలో ఇప్పటివరకు 65% పెరిగింది. భవిష్యత్తులో కూడా దీని ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడి విషయానికి వస్తే బంగారం ఎప్పుడూ సురక్షితమైన, నమ్మదగిన ఎంపికగా పరిగణించబడుతుంది. కేవలం ధర పెరగడమే కాకుండా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇది ఒక భరోసాగా నిలుస్తుంది. అందుకే గత 25 ఏళ్లలో బంగారం సగటున ఏడాదికి 14.6% రిటర్న్స్ ఇచ్చింది. ఇది ఏ ఇతర సాంప్రదాయ పొదుపు పథకాలు లేదా బ్యాంక్ డిపాజిట్ల కంటే చాలా ఎక్కువ.
గత 25 ఏళ్లలో బంగారం ధర ఎంత పెరిగింది?
అక్టోబర్ 2000లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 4,400 రూపాయలు మాత్రమే. కానీ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు బంగారం ధర దాదాపు 1.33 లక్షల రూపాయలకు చేరుకుంది. అంటే ఇది నేరుగా 14.6% వార్షిక వృద్ధి రేటును (CAGR) సూచిస్తుంది. బంగారం ధరలు పెరుగుతున్న తీరును చూస్తుంటే మరో 25 ఏళ్ల తర్వాత (మీ పిల్లల పెళ్లిళ్ల సమయానికి) బంగారం ధర ఎంత ఉండవచ్చు అనే సందేహం కలగడం సహజం. దానిపై ఒక అంచనా ఇక్కడ ఉంది.
Also Read: బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్.. కారణమిదే?!
2050 నాటికి బంగారం ధర ఎంత ఉండవచ్చు?
వచ్చే 25 ఏళ్ల పాటు బంగారం ధరలు ఇదే వేగంతో (14.6% CAGR) పెరుగుతూ పోతే 2050 నాటికి 10 గ్రాముల బంగారం ధర సుమారు 40 లక్షల రూపాయలకు చేరుకోవచ్చు. అప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నా కేవలం 25 గ్రాముల బంగారాన్ని మాత్రమే కొనగలుగుతారు.
గమనిక: ఈ లెక్కలు కేవలం ఒక అంచనా మాత్రమే. బంగారం ధరలు వడ్డీ రేట్లు, డాలర్ విలువ, సెంట్రల్ బ్యాంక్ పాలసీలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి 2050లో ధర 40 లక్షల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు.
బంగారం ధరలు పెరగడానికి కారణాలేంటి?
నమ్మదగిన పెట్టుబడి: గత 25 ఏళ్లలో స్టాక్ మార్కెట్ లేదా బాండ్లు నష్టపోయిన ప్రతిసారీ బంగారం ధరలు పుంజుకున్నాయి.
ఆర్థిక అనిశ్చితి: ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన స్థావరంగా భావిస్తారు.
సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు: ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేయడం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.
