అక్షయ తృతీయ అంటేనే బంగారం, వెండి కొనుగోళ్లకు శుభసూచకం. అయితే ఈ ఏడాది వినియోగదారులు షాపుల ముందు క్యూ కట్టడం కంటే, స్విగ్గీ ఇన్స్టామార్ట్ (Instamart) వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేయడానికే మొగ్గు చూపారు. సాధారణంగా కూరగాయలు, నిత్యావసరాలు డెలివరీ చేసే ఇన్స్టామార్ట్, ఈ అక్షయ తృతీయ నాడు బంగారు వ్యాపారంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బంగారు నాణాల ఆర్డర్లు ఏకంగా 49 రెట్లు (49x) పెరగగా, వెండి విక్రయాలు 24 రెట్లు (24x) వృద్ధి చెందాయి. ముఖ్యంగా అందుబాటు ధరలో ఉండే 0.5 గ్రాము, 1 గ్రాము మరియు 2 గ్రాముల బంగారు నాణాలకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. సాంప్రదాయాన్ని పాటిస్తూనే, టెక్నాలజీ సాయంతో నిమిషాల వ్యవధిలోనే ఇంటికి బంగారాన్ని తెప్పించుకోవడం ఈ పండుగ నాడు హైలైట్‌గా నిలిచింది.
వినియోగదారులను ఆకర్షించడానికి ఇన్స్టామార్ట్ ప్రవేశపెట్టిన ‘ప్రైజ్ లాక్’ (Price Lock) లేదా ప్రీ-బుకింగ్ ఫీచర్ ఈ విజయానికి ప్రధాన కారణమైంది. బంగారం ధరల్లో నిత్యం ఉండే హెచ్చుతగ్గుల నుండి కస్టమర్లను రక్షించడానికి ఏప్రిల్ 10-16 మధ్య పాత ధరలకే బంగారాన్ని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీనివల్ల పండుగ రోజు మార్కెట్ ధరలు పెరిగినా, కస్టమర్లు తక్కువ ధరకే నాణాలను పొందగలిగారు. మొత్తం డిమాండ్‌లో సుమారు 40% ఆర్డర్లు ఈ ప్రీ-బుకింగ్ ఫీచర్ ద్వారానే రావడం విశేషం. ఇది వినియోగదారులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా, ప్లాట్‌ఫామ్ పట్ల నమ్మకాన్ని పెంచింది.
ఈసారి పండుగ షాపింగ్ కేవలం బంగారానికే పరిమితం కాలేదు. బెంగళూరుకు చెందిన ఒక వినియోగదారుడు ఏకంగా రూ. 1,99,917 విలువైన అతిపెద్ద ఆర్డర్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ కార్ట్‌లో రూ. 1.65 లక్షల విలువైన వెండి బార్లు, రూ. 31,800 విలువైన బంగారు నాణాలతో పాటు కూల్ డ్రింక్స్, ఐస్ క్యూబ్స్, అల్ఫోన్సో మామిడిపండ్లు మరియు ఒక స్మార్ట్ వాచ్ కూడా ఉండటం గమనార్హం. కేవలం బంగారం కొనడమే కాకుండా, పండుగకు కావాల్సిన ఇతర సరుకులను కూడా ఒకే ఆర్డర్‌లో తెప్పించుకోవడం అనేది ప్రస్తుత క్విక్ కామర్స్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాలు ఈ కొనుగోళ్లలో అగ్రస్థానంలో నిలిచాయి.
