Credit Card: బంధువులు కూడా ఆదుకోని కష్టకాలంలో క్రెడిట్ కార్డ్ ఒక గొప్ప ఆసరాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మీరు తెలివిగా ఉపయోగిస్తే ఇది మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించడమే కాకుండా భవిష్యత్తులో బ్యాంకుల నుండి లోన్లు పొందడానికి కూడా సహాయపడుతుంది. అయితే క్రెడిట్ కార్డ్ కేవలం జీతం వచ్చే వారికే ఇస్తారా? నిరుద్యోగులు, విద్యార్థులు, గృహిణులు లేదా ఫ్రీలాన్సర్లు దీనిని పొందలేరా? అంటే.. ఖచ్చితంగా పొందవచ్చు. ఆదాయ ధృవీకరణ పత్రం లేకుండా క్రెడిట్ కార్డ్ పొందే సులభమైన మార్గాలీవే.
ఆదాయ ధృవీకరణ లేకుండా క్రెడిట్ కార్డ్
సాధారణంగా బ్యాంకులు క్రెడిట్ కార్డ్ ఇచ్చేముందు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అడుగుతాయి. ఎందుకంటే మీరు వాడిన డబ్బును తిరిగి చెల్లించగలరా లేదా అని బ్యాంకులు నిర్ధారించుకోవాలి. విద్యార్థులు లేదా ఫ్రీలాన్సర్లకు ఇది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు.
సాధారణ ‘అన్‌సెక్యూర్డ్’ క్రెడిట్ కార్డ్‌లకు ఆదాయ రుజువు అవసరం. కానీ సంప్రదాయ ఆదాయ వనరులు లేని వారి కోసం ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇవి మీ క్రెడిట్ హిస్టరీని నిర్మించుకోవడానికి భవిష్యత్తులో మంచి కార్డ్‌లు పొందడానికి సహాయపడతాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారంగా
ఆదాయ ధృవీకరణ లేనప్పుడు అత్యుత్తమ మార్గం ‘సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్’. మీరు బ్యాంకులో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారంగా ఈ కార్డ్ ఇస్తారు. ఉదాహరణకు ICICI బ్యాంక్ వంటి సంస్థలు FDపై తక్షణమే క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నాయి. మీ అవసరాలకు తగినట్లుగా వివిధ రకాల కార్డ్‌లను ఎంచుకోవచ్చు. ప్రతి కార్డ్‌కు కనీస FD మొత్తం ఉండాలి. సాధారణంగా మీ FD మొత్తంలో 90% వరకు క్రెడిట్ లిమిట్‌గా ఇస్తారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక కార్డ్‌లు
విద్యార్థుల అవసరాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్రెడిట్ కార్డ్‌లు మార్కెట్లో ఉన్నాయి. ఇవి సాధారణ కార్డ్‌ల కంటే భిన్నంగా పనిచేస్తాయి. వీటిని పొందడానికి విద్యార్థులు ఎటువంటి ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.
బ్యాంక్ బ్యాలెన్స్ నిర్వహణ
మీరు మీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో క్రమం తప్పకుండా మంచి బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేస్తుంటే మీ లావాదేవీల హిస్టరీని బట్టి బ్యాంకులు స్వయంగా క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తాయి.
