Central Govt Employees: పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు (Central Govt Employees) శుభవార్త అందించింది. గణేష్ చతుర్థి, ఓనం పండుగలకు ముందుగానే జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పండుగలను జరుపుకోవచ్చు.
ఎప్పుడు చెల్లిస్తారు?
ఆగస్టు 21, 22న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన కార్యాలయ ఆదేశాల ప్రకారం.. మహారాష్ట్రలో డిఫెన్స్, పోస్ట్, టెలికాం సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు ఆగస్టు 26 (మంగళవారం)న అందనున్నాయి. అంటే గణేష్ చతుర్థి (ఆగస్టు 27న) కంటే ఒక రోజు ముందే వారి జీతాలు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అదేవిధంగా సెప్టెంబర్ 4-5 వరకు ఓనం పండుగ జరుపుకునే కేరళలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా ఆగస్టు 25న (సోమవారం) జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారు.
Also Read: PM Modi: ఈ ఏడాది మార్కెట్లోకి భారత్‌లో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్: మోదీ
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు
పండుగ వేళ ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబంతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చెల్లింపులను అడ్వాన్స్‌గా పరిగణిస్తారు. వీటిని ఆగస్టు/సెప్టెంబర్ 2025 నెలల జీతాలు, పెన్షన్ల ఫైనల్ సెటిల్‌మెంట్‌లో సర్దుబాటు చేస్తారు. “ఈ విధంగా పంపిణీ చేయబడిన జీతం/వేతనాలు/పెన్షన్ అడ్వాన్స్‌గా పరిగణించబడుతుంది. ప్రతి ఉద్యోగి/పెన్షనర్ పూర్తి నెల జీతం/వేతనం/పెన్షన్ నిర్ధారణ అయిన తర్వాత సర్దుబాటు చేయబడుతుంది” అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
ఆర్బీఐకి ఆర్థిక శాఖ సూచన
ఆర్థిక మంత్రిత్వ శాఖ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)ను కోరింది. కేరళ, మహారాష్ట్రలోని బ్యాంకు శాఖలకు ఎలాంటి జాప్యం లేకుండా జీతాలు, పెన్షన్లు అడ్వాన్స్‌గా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కేరళలోని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ఉద్యోగులకు కూడా ఈ ముందస్తు చెల్లింపుల ఆదేశాలు వర్తిస్తాయి. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.