హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బృహస్పతి టెక్నాలజీస్ లిమిటెడ్ అనే సంస్థ తాజాగా గొప్ప విజయాన్ని సాధించింది. విదేశీ సంస్థాగత మదుపుదారుల నుంచి 10 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించింది. ఈ పెట్టుబడితో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ పాపోలు ప్రకారం.. హైదరాబాద్‌లో 72 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సీసీటీవీ ఉత్పాదక యూనిట్‌ను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రారంభించాలనే యోచనతో ఉన్నారు.
Tulbul project : పాక్‌కు అడ్డుకట్ట..తుల్‌బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం యోచన..!
విస్తరణకు భాగంగా కంపెనీ 400 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని, అంతర్జాతీయ స్థాయిలో తయారయ్యే, కానీ భారత్‌లో అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత భద్రతా పరిష్కారాలను అందించాలని భావిస్తోంది. కంపెనీ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే యోచనలో ఉంది. IPO ద్వారా వచ్చే నిధులతో తమ పరిశోధన మరియు అభివృద్ధి (R&D) విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచాలని, అలాగే కొత్త ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయాలని ఆశిస్తోంది.
ఇక ఇటీవల బృహస్పతి టెక్నాలజీస్ సంస్థకు మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) నుండి ఒక ముఖ్యమైన నిఘా ప్రాజెక్ట్ లభించింది. ఇందులో భాగంగా MSRTC నెట్‌వర్క్ వ్యాప్తంగా ఏఐ ఆధారిత సీసీటీవీ వ్యవస్థలను అమర్చనున్నది. ఇప్పటివరకు సంస్థ దేశవ్యాప్తంగా 12 లక్షల సీసీటీవీ కెమెరాలు అమర్చి విశేష అనుభవాన్ని సంపాదించింది. బీఎస్ఎఫ్, భారత ఎన్నికల కమిషన్, వన్యప్రాణుల నిఘా, పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ వంటి అనేక రంగాల్లో సంస్థ కీలక భూమిక పోషిస్తోంది. ఒకే రోజు 19 రాష్ట్రాల్లో 64,000 సీసీటీవీ కెమెరాలను అమర్చి NEET పరీక్ష కోసం రికార్డు సృష్టించడం ఈ సంస్థ ప్రతిభకు నిదర్శనం. దేశంలో నిఘా, భద్రతా రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ అవసరాలను అందుకునేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని రాజశేఖర్ తెలిపారు.