Site icon HashtagU Telugu

Bharat Taxi: ఇక‌పై ఓలా, ఉబర్‌లకు గట్టి పోటీ.. ఎందుకంటే?

Bharat Taxi

Bharat Taxi

Bharat Taxi: కేంద్ర ప్రభుత్వం భారతదేశపు మొట్టమొదటి సహకార టాక్సీ సేవ “భారత్ టాక్సీ” (Bharat Taxi)ను ప్రారంభించింది. ఇది ఓలా (Ola), ఉబర్‌ (Uber) వంటి ప్రైవేట్ కంపెనీలకు నేరుగా సవాలు విసిరే విధంగా రూపొందించబడింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడిన ఈ చొరవ డ్రైవర్లకు వారి సంపాదనపై పూర్తి యాజమాన్యాన్ని ఇవ్వడం, అదే సమయంలో ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లకు బదులుగా ప్రయాణీకులకు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఒక ఎంపికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

యాప్ ఆధారిత టాక్సీ సేవల గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వీటిలో అపరిశుభ్రమైన వాహనాలు, పెరిగిన ధరలు, ఏకపక్షంగా రద్దు చేయడం, ధరలు ఆకస్మికంగా పెంచడం వంటివి ఉన్నాయి. కంపెనీలు వసూలు చేసే అధిక కమీషన్ రేట్లపై కూడా చాలా మంది డ్రైవర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీని కారణంగా తరచుగా వారి అద్దె ఆదాయంలో 25 శాతం వరకు నష్టపోతున్నారు.

కమీషన్ ఎంత ఉంటుంది?

సరికొత్త భారత్ టాక్సీ ప్లాట్‌ఫారమ్ ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ అగ్రిగేటర్ల మాదిరిగా కాకుండా భారత్ టాక్సీ డ్రైవర్లు తమ ట్రిప్‌లపై ఎలాంటి కమీషన్ చెల్లించరు. దీనికి బదులుగా వారు సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో పని చేస్తారు. దీనిలో కేవలం స్వల్ప మొత్తంలో రోజువారీ, వారపు లేదా నెలవారీ రుసుమును మాత్రమే చెల్లిస్తారు. దీని వలన డ్రైవర్ల సంపాదన పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: SSMB 29 Update: మ‌హేష్‌- రాజ‌మౌళి మూవీ.. లీక్ వ‌దిలిన త‌న‌యుడు!

ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా

భారత్ టాక్సీ పైలట్ దశ నవంబర్ నెలలో ఢిల్లీలో 650 వాహనాలు, వాటి యజమానులు-డ్రైవర్లతో ప్రారంభమవుతుంది. ఇది విజయవంతమైతే డిసెంబర్‌లో దీనిని పూర్తిగా ప్రారంభించి ఆ తర్వాత ఈ సేవ ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరించబడుతుంది.

వచ్చే సంవత్సరం నాటికి

అధికారుల ప్రకారం.. ప్రారంభ దశలో 5,000 మంది పురుష, మహిళా డ్రైవర్లు పాల్గొంటారు. దీని తర్వాత వచ్చే ఏడాది ఈ సేవ ముంబై, పూణే, భోపాల్, లక్నో, జైపూర్ సహా 20 నగరాలకు విస్తరించబడుతుంది. మార్చి 2026 నాటికి అనేక మెట్రోపాలిటన్ ప్రాంతాలలో భారత్ టాక్సీ కార్యకలాపాలను స్థాపించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి, ఈ ప్లాట్‌ఫారమ్‌లో 1 లక్ష మంది డ్రైవర్లు చేరే అవకాశం ఉంది. ఇది జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరుకుంటుంది.

భారత్ టాక్సీ ప్రైవేట్ యాజమాన్యంలోని కంపెనీగా కాకుండా ఒక సహకార సంస్థ వలె పనిచేస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ను సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. దీనిని జూన్ 2025 లో రూ. 300 కోట్ల ప్రారంభ పెట్టుబడితో స్థాపించారు.

ఎలా ఉపయోగించవచ్చు?

ఓలా, ఉబర్ యాప్ మాదిరిగానే మీరు భారత్ టాక్సీ సేవలను బుక్ చేసుకోగలుగుతారు. ఆండ్రాయిడ్ యూజర్లు, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఐఫోన్ యూజర్లు, ఆపిల్ స్టోర్ నుండి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోగలుగుతారు. హిందీ, ఇంగ్లీషుతో పాటు మీరు గుజరాతీ, మరాఠీ భాషలలో కూడా ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. ఇది మెంబర్‌షిప్ ఆధారిత ప్లాన్ అవుతుంది. డ్రైవర్లకు ప్రతి రైడ్ నుండి వచ్చే 100 శాతం ఆదాయం లభిస్తుంది. అద్దె విషయంలో కమీషన్ ఉండదు కాబట్టి దీని రైడ్‌లు ఓలా, ఉబర్, ర్యాపిడోల కంటే చౌకగా ఉంటాయని చెప్పబడుతోంది.

Exit mobile version