Bharat Taxi: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ట్యాక్సీ సేవ ‘భారత్ ట్యాక్సీ’ (Bharat Taxi) ప్రారంభమైంది. ఓలా, ఊబర్, ర్యాపిడో లాగే మీరు దీనిని యాప్ ద్వారా రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ దశలో ఉంది. ఇది విజయవంతమైతే పూర్తి స్థాయిలో ప్రారంభించబడుతుంది. ఈ పైలట్ దశలో భారత్ ట్యాక్సీ కార్లు, ఆటో-రిక్షాలు, బైక్‌లతో సహా అనేక రకాల వాహనాలను అందిస్తుంది. ఇప్పటివరకు 51,000 మందికి పైగా డ్రైవర్లు యాప్‌ను ఉపయోగించడానికి సైన్ అప్ చేసుకున్నారు.
ఓలా, ఊబర్, ర్యాపిడో కంటే భారత్ ట్యాక్సీ రైడ్ చౌకగా ఉంటుందా?
సమాచారం ప్రకారం.. భారత్ ట్యాక్సీ రైడ్ చౌకగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంట.. ఇతర యాప్‌ల మాదిరిగా కాకుండా భారత్ ట్యాక్సీ ఛార్జీలలో కమీషన్ ఉండదు. సంస్థకు, డ్రైవర్లకు మధ్య ఈ మొత్తం పంపిణీ చేయబడదు. ఛార్జీల ద్వారా వచ్చే మొత్తం డబ్బు పూర్తిగా డ్రైవర్‌కే అందుతుంది. అంటే కమీషన్ లేకుండా ఛార్జీలు చౌకగా ఉంటాయి.
Also Read: India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరంటే?
డ్రైవర్లకు ఎక్కువ డబ్బు లభిస్తుంది?
ఈ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు చెల్లించే మొత్తం డ్రైవర్లకు చేరుతుంది. డ్రైవర్లు సంస్థకు కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా వారు సభ్యత్వం తీసుకోవాలి. ఇది ఒక వారం లేదా ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ రోజులకు ఉండవచ్చు. దీంతో పాటు వారికి సంస్థ బోర్డులో ప్రాతినిధ్యం, షేర్లపై డివిడెండ్ కూడా ఇవ్వబడుతుంది. ఈ మోడల్ డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఒక పెద్ద అడుగు కానుంది.
ఎలాంటి ఫీచర్లు లభిస్తాయి?
ఈ ట్యాక్సీ యాప్‌లో సౌలభ్యం, పారదర్శకత, భద్రత కోసం అనేక ఫీచర్లు ఇవ్వబడ్డాయి.
- యూజర్-ఫ్రెండ్లీ మొబైల్ రైడ్ బుకింగ్
- పారదర్శక ఛార్జీల వ్యవస్థ, సహకార ధరల మోడల్
- వాహనం ట్రాకింగ్, బహుళ-భాషా ఇంటర్‌ఫేస్
- 24/7 కస్టమర్ సపోర్ట్, టెక్-ఎనేబుల్డ్ అసిస్టెన్స్
- డ్రైవర్, ప్రయాణీకులకు సురక్షితమైన, ధృవీకరించబడిన ఆన్‌బోర్డింగ్
- అన్ని రకాల వాహనాల కోసం కలుపుగోలు మొబిలిటీ ఎంపిక
- ఢిల్లీ పోలీసు భాగస్వామ్యంతో మెరుగైన భద్రతా ఫ్రేమ్‌వర్క్
భారత్ ట్యాక్సీ యాప్‌ను సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఇది MSCS చట్టం 2002 కింద రిజిస్టర్ అయిన మల్టీ-స్టేట్ కోఆపరేటివ్. దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి నేషనల్ మొబిలిటీ కోఆపరేటివ్‌గా అభివర్ణిస్తున్నారు. దీని యాజమాన్యం పూర్తిగా డ్రైవర్ల వద్దే ఉంటుంది. ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి వాటా లేదు. ఈ కోఆపరేటివ్‌లో ఇప్పటికే న్యూ ఢిల్లీ, సౌరాష్ట్రలలో 51,000 మందికి పైగా రిజిస్టర్ అయిన డ్రైవర్-సభ్యులు ఉన్నారు. ఇది బీటా దశలో అతిపెద్ద డ్రైవర్-యాజమాన్యంలోని మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌గా నిలిచింది.
