Site icon HashtagU Telugu

Apple Store : భారత్‌లో యాపిల్ నాలుగో స్టోర్‌.. ఎక్కడో తెలుసా?

Apple's fourth store in India.. Do you know where it is?

Apple's fourth store in India.. Do you know where it is?

Apple Store : ప్రపంచంలో అగ్రగామి టెక్నాలజీ కంపెనీగా వెలుగొందుతున్న యాపిల్ (Apple) భారత్‌లో తన ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. దేశీయంగా తయారీ మరియు విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. భారత్‌లో నాలుగో యాపిల్ స్టోర్‌ను మహారాష్ట్రలోని పుణె నగరంలో సెప్టెంబర్ 4న ప్రారంభించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. పుణెలోని ప్రఖ్యాత కొరెగావ్ పార్క్ ప్రాంతంలో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన తొలి అధికారిక చిత్రాన్ని కూడా యాపిల్ విడుదల చేసింది. బెంగళూరులో ఉన్న యాపిల్ స్టోర్ మాదిరిగానే, పుణే స్టోర్‌ను కూడా నెమలి ఆకారంలోని ప్రత్యేక కళాకృతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ స్టోర్ సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానుందని తెలుస్తోంది. దేశంలో ఇది నాలుగవ యాపిల్ స్టోర్ కావడం విశేషం. ఇప్పటికే ముంబయి, న్యూఢిల్లీ, బెంగళూరు నగరాల్లో యాపిల్ స్టోర్లు విజయవంతంగా సేవలందిస్తున్నాయి.

వ్యూహాత్మక విస్తరణ.. ఐఫోన్ 17 పూర్తిగా భారత్‌లోనే

ఈ కొత్త స్టోర్ ప్రారంభానికి సమకాలంలో, యాపిల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 17 (iPhone 17) సిరీస్‌కు చెందిన అన్ని మోడళ్లను ప్రో వెర్షన్లు సహా పూర్తిగా భారత్‌లో తయారుచేయాలని యాపిల్ నిర్ణయించింది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికాకు ఎగుమతులపై ఉన్న టారిఫ్ ప్రమాదాలను నివారించాలనే వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్ ఎగుమతులు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలకాబోయే ఐఫోన్ 17 మోడళ్లను యాపిల్ భారత్‌లోని ఐదు కీలక తయారీ కేంద్రాల్లో నిర్మించనుంది. దీనిలో చెన్నై సమీపంలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్, కర్ణాటకలోని విస్ట్రాన్ యూనిట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని మరో మూడు తయారీ కేంద్రాలు ప్రధానంగా ఉంటాయని సమాచారం. ఇదే మొదటిసారి విడుదలకు ముందే ప్రో వెర్షన్ల సహా అన్ని ఐఫోన్ 17 మోడళ్లను భారత్‌లోనే తయారు చేయనుండడం గమనార్హం. ఇది భారత్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిశ్రమ వర్గాలు
పేర్కొంటున్నాయి.

భారత్‌పై యాపిల్ నమ్మకం పెరుగుతోంది

భారత్‌లో వ్యాపార అవకాశాలు భారీగా ఉన్నాయని గతంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా వ్యాఖ్యానించారు. భారత్ అనేది యాపిల్‌కు ఒక కీలకమైన మార్కెట్, ఇక్కడ మరింత గణనీయమైన విస్తరణకు తగిన అవకాశాలున్నాయి అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులపై ఉన్న ఆదరణ, ప్రీమియం మార్కెట్ విస్తరణ, యువతలో బ్రాండ్ క్రేజ్ఇవన్నీ కలిసి భారతదేశాన్ని ఆపిల్‌కు ప్రాధాన్యత గల మార్కెట్‌గా మార్చాయి. యాపిల్ ఈ విస్తరణలతో భారతీయ వినియోగదారులకు మరింత చేరువ కావడమే కాక, దేశీయ తయారీ రంగానికి కొత్త ప్రోత్సాహం అందిస్తోంది. ఇది “మేక్ ఇన్ ఇండియా” (Make in India) లక్ష్యాలకు అనుగుణంగా సాగుతోంది.

Read Also: BRS : కోదండరాంపై సీఎం రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరు : దాసోజు శ్రవణ్