Air India: అమృత్‌సర్ నుండి బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI117 ల్యాండింగ్‌కు కొద్ది క్షణాల ముందు అకస్మాత్తుగా ఎమర్జెన్సీ సిస్టమ్ (RAT) యాక్టివేట్ అవ్వడంతో ఆ విమానాన్ని బర్మింగ్‌హామ్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే ఊరట కలిగించే విషయం ఏంటంటే ప్రయాణికులు, సిబ్బంది (క్రూ మెంబర్స్) అందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటన విమానం రన్‌వేకు చేరువలో ఉన్నప్పుడు ల్యాండింగ్ చివరి దశ (ఫైనల్ అప్రోచ్)లో జరిగింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది.
ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన
ఎయిర్ ఇండియా తమ అధికారిక ప్రకటనలో ఈ విధంగా పేర్కొంది. “2025 అక్టోబరు 4న అమృత్‌సర్ నుండి బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న ఫ్లైట్ AI117లో ఆపరేటింగ్ క్రూకి ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు RAT డిప్లాయ్‌మెంట్ గురించి సమాచారం అందింది. తనిఖీలో అన్ని ఎలక్ట్రికల్, హైడ్రాలిక్ పారామీటర్లు సాధారణంగా ఉన్నట్లు తేలింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎటువంటి సాంకేతిక లోపం నమోదు కాలేదు” అని పేర్కొంది.
Also Read: Heart Attacks In Women: మహిళల్లో గుండెపోటు.. కారణాలివే అంటున్న నిపుణులు!
ప్రమాదానికి దారితీసే ఏ సంభావ్య ప్రమాదాన్నీ నివారించడానికి, ప్రామాణిక నిర్వహణ విధానం (SOP) ప్రకారం విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసేందుకు తాత్కాలికంగా సేవ నుండి (గ్రౌండ్) తొలగించినట్లు కంపెనీ తెలిపింది. దీని కారణంగా తిరిగి రావాల్సిన విమానం AI114 (బర్మింగ్‌హామ్ నుండి ఢిల్లీ) రద్దు చేయబడింది.
ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
రద్దు చేయబడిన తిరిగి ప్రయాణించే విమానంలోని ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు, బస ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. “మా ప్రయాణికులు, సిబ్బంది భద్రత మాకు అత్యంత ప్రాధాన్యత” అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. అన్ని సిస్టమ్‌లు సాధారణంగా ఉన్నప్పటికీ పూర్తి సాంకేతిక తనిఖీ (Full Technical Inspection) జరుగుతోందని, తద్వారా ఏదైనా సంభావ్య ప్రమాదాన్ని నివారించవచ్చని ఆయన చెప్పారు. ఎయిర్‌లైన్ మెయింటెనెన్స్ టీమ్, ఇంజనీరింగ్ యూనిట్ ప్రస్తుతం విమానాన్ని పరిశీలిస్తున్నాయి. అలాగే,ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) డేటా కూడా సమీక్షిస్తున్నారు.
RAT అంటే ఏమిటి?
RAT (Ram Air Turbine) అనేది ఒక అత్యవసర భద్రతా వ్యవస్థ. విమానంలోని ప్రధాన విద్యుత్ లేదా హైడ్రాలిక్ వ్యవస్థలలో ఏదైనా లోపం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఇది స్వయంచాలకంగా యాక్టివేట్ అవుతుంది. ఇది విమానం ఇంజిన్ కింద లేదా రెక్కల నుండి బయటకు వచ్చి, గాలి ఒత్తిడి (Air Pressure) ద్వారా తిరుగుతూ విమానానికి అత్యవసర విద్యుత్ (Emergency Power), హైడ్రాలిక్ ప్రెజర్‌ను అందిస్తుంది.
