Jio Vs Airtel : అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ‘స్టార్‌లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారతీయులకు అందే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈక్రమంలో మంగళవారం రోజు స్పేస్ ఎక్స్‌తో ఎయిర్ టెల్ డీల్ కుదుర్చుకోగా.. ఇవాళ(బుధవారం) జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ కూడా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎయిర్ టెల్, జియోలు సెల్‌ఫోన్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ శాటిలైట్ సిగ్నల్స్‌తో ఇంటర్నెట్ సేవలను అందించేందుకు మార్గం సుగమం అయింది. స్పేస్ ఎక్స్‌తో కుదిరిన డీల్ ప్రకారం.. భారత సంపన్న పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన జియో(Jio Vs Airtel) తన రిటైల్ దుకాణాలు, ఆన్‌లైన్ వేదికల్లో స్టార్‌లింక్ ఉత్పత్తులను విక్రయిస్తుంది. వాటికి సంబంధించిన కస్టమర్ సర్వీస్, ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్ సౌకర్యాలను సైతం వినియోగదారులకు అందిస్తుంది. ప్రతి భారతీయుడికి చౌక ధరకే వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని జియో గ్రూప్ సీఈఓ మాథ్యూ ఒమెన్ ప్రకటించారు. స్టార్ లింక్‌తో ఒప్పందం వల్ల అనేక మంది జియో యూజర్లకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందుతుందన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా అనేక కమ్యూనిటీలు, వ్యాపారాలు బలోపేతం అవుతాయన్నారు.
Also Read :God Is Real : దేవుడు ఉన్నాడు.. గణిత ఫార్ములాతో నిరూపిస్తా.. శాస్త్రవేత్త విల్లీ సూన్
ఈ రంగాలకు లాభం
భారత దేశంలోని వ్యాపారాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, మారుమూల ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవలను అందించడానికి స్పేస్‌ఎక్స్‌తో ఎయిర్‌టెల్, జియో కలిసి పనిచేస్తాయి. స్పేస్ ఎక్స్‌కు అంతరిక్షంలో 7వేలకు పైగా శాటిలైట్లు ఉన్నాయి. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఉపగ్రహ నెట్‌వర్క్‌ను కలిగిన కంపెనీగా స్పేస్ ఎక్స్ ఎదిగింది. స్టార్ లింక్ ఇంటర్నెట్ ద్వారా స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వీడియో కాల్ వంటి అనేక సౌకర్యాలను యూజర్లు మారుమూల ప్రాంతాల్లోనూ ఆస్వాదించవచ్చు. ఈ ఇంటర్నెట్ వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
Also Read :Nara Lokesh : శాసనమండలిలో లోకేష్ పిట్టకథ
ఎలాన్ మస్క్ పెద్ద వ్యూహం
భారతదేశ టెలికాం రంగంలో ఇప్పుడు జియో, ఎయిర్ టెల్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అందుకే ఈ రెండు కంపెనీలతోనూ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఎలాన్ మస్క్ ప్రాధాన్యత ఇచ్చారు. తద్వారా తన స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసులు వేగవంతంగా భారత్‌లో విస్తరిస్తాయని మస్క్ భావిస్తున్నారు. ఈ వ్యూహం తప్పకుండా కలిసి వస్తుందని పరిశీలకులు అంటున్నారు. జియో, ఎయిర్ టెల్‌లకు విస్తారమైన మార్కెట్‌లో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విస్తరణ తథ్యమని చెబుతున్నారు.