Winter Driving: చలి నుండి రక్షణ కోసం చాలా మంది కారు హీటర్ ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచేస్తుంటారు. అయితే ఎక్కువ వేడి గాలి డ్రైవింగ్, ఆరోగ్యం రెండింటికీ హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కారులో సరైన ఉష్ణోగ్రతను నిర్వహించడం చాలా ముఖ్యం.
కారు ఏసీ/హీటర్ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?
చలికాలంలో కారు లోపలి ఉష్ణోగ్రత బయటి వాతావరణం కంటే మరీ ఎక్కువగా ఉండకూడదు. సాధారణంగా కారు క్యాబిన్ ఉష్ణోగ్రతను 22 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం ఉత్తమం. దీనివల్ల డ్రైవింగ్ సురక్షితంగా ఉంటుంది. శరీరం అసౌకర్యానికి గురికాదు.
సుదీర్ఘ ప్రయాణాల కోసం చిట్కాలు
మీరు ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నట్లయితే ఉష్ణోగ్రత సెట్టింగ్స్‌లో ఈ మార్పులు చేసుకోండి.
ఉష్ణోగ్రత: లాంగ్ డ్రైవ్ సమయంలో టెంపరేచర్‌ను 20 నుండి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచండి.
దుష్ప్రభావాలు: ఎక్కువ వేడి వల్ల నిద్రమత్తు రావడం, ఏకాగ్రత తగ్గడం, చర్మం, కళ్లు, ముక్కు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ముందస్తు జాగ్రత్త: కారులోకి రాగానే భారీ దుస్తులు (జాకెట్లు వంటివి) విప్పేసి, ఆ తర్వాతే హీటర్ టెంపరేచర్‌ను సెట్ చేయండి.
Also Read: మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
హీటర్ వల్ల కలిగే లాభ-నష్టాలు
హీటర్ లేదా బ్లోవర్‌ను ఎక్కువసేపు నడపడం వల్ల కారు లోపలి గాలి పొడిబారిపోతుంది. దీనివల్ల శరీరంలోని తేమ తగ్గి కళ్లు, ముక్కులో ఇబ్బంది కలగవచ్చు. సమతుల్యమైన వేడి ఉంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత, ప్రతిచర్యలు వేగంగా ఉంటాయి.
చలికాలంలో కారు భద్రత
చలికాలంలో కారు పనితీరు మందగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రింది వాటిని తనిఖీ చేయండి.
బ్యాటరీ: చలి కారణంగా బ్యాటరీ పనితీరు 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.
లిక్విడ్స్: యాంటీ-ఫ్రీజ్, కూలెంట్ స్థాయిలను సరిగ్గా ఉంచండి. బ్రేక్ ఫ్లూయిడ్, వాషర్ ఫ్లూయిడ్ కూడా తనిఖీ చేయండి.
ఇతర భాగాలు: టైర్ ప్రెజర్, లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, విండ్‌షీల్డ్ వైపర్ల పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేయండి.
డిఫాగర్: కారు ముందు, వెనుక ఉండే డిఫాగర్లు, ఏసీ- హీటర్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం.
