Site icon HashtagU Telugu

MG M9 : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ నుంచి విలాసవంతమైన ఎం9..ధరెంతో తెలుసా..!

The luxurious M9 from JSW MG Motor..do you know how much it costs..!

The luxurious M9 from JSW MG Motor..do you know how much it costs..!

MG M9 : భారతదేశంలోని ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఆ పోటీలో ఒక మెట్టు పైకి చేరింది. కంపెనీ తాజాగా లగ్జరీ ఎలక్ట్రిక్ ఎం9 మోడల్ కారును మార్కెట్లో ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కారు ప్రారంభ ధరను రూ.69.90 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ధర) నిర్ణయించారు. ఆగస్టు 10 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి రూ. లక్ష అడ్వాన్స్‌ చెల్లించి, ఎంజీ సెలక్ట్ వెబ్‌సైట్‌ లేదా 13 ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో బుకింగ్‌ చేసుకోవచ్చు.

శక్తివంతమైన బ్యాటరీ – గరిష్ట ప్రయాణ రేంజ్‌

ఎంజీ ఎం9కు 90 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం గల ఎన్‌ఎంసీ బ్యాటరీను అమర్చారు. దీన్ని ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే దాదాపు 548 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది 245 బీహెచ్‌పీ శక్తిని, 350 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే మోటార్‌తో పనిచేస్తుంది. వీటితో పాటు వినియోగదారుల సౌలభ్యం కోసం 11 కిలోవాట్‌ వాల్‌బాక్స్‌ ఛార్జర్, 3.3 కిలోవాట్‌ పోర్టబుల్‌ ఛార్జర్‌ కూడా అందిస్తున్నారు. అంతేకాదు, హై వోల్టేజ్‌ బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీ, అలాగే వాహనంపై మూడు సంవత్సరాల పాటు అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీని అందించనున్నారు. ఇది వినియోగదారుల నమ్మకాన్ని మరింతగా పెంచే అంశం.

ఇంటీరియర్‌ – లగ్జరీ బిజినెస్ క్లాస్ అనుభూతి

ఎం9 అంతర్గత రూపకల్పన పూర్తిగా విలాసవంతమైన బిజినెస్ క్లాస్ అనుభూతిని కలిగించేలా ఉంది. ఇందులో 16 మార్గాల్లో అడ్జస్ట్‌ అయ్యే ప్రెసిడెన్షియల్‌ సీట్స్‌, వెంటిలేషన్, హీటింగ్, 8 మసాజ్ ఫంక్షన్‌లు వంటి ఫీచర్లను సమృద్ధిగా ఇచ్చారు. వీటన్నింటినీ ఇంటెలిజెంట్‌ ఆర్మ్‌రెస్ట్‌ సాయంతో నియంత్రించవచ్చు. అంతేకాదు, ప్రీమియం లెదర్‌ సీట్లు, 13 స్పీకర్లతో కూడిన సౌండ్‌ సిస్టమ్‌, 64 రంగుల యాంబియంట్‌ లైటింగ్‌, డ్యూయల్‌ సన్‌రూఫ్‌, 1720 లీటర్ల స్టోరేజ్‌ స్పేస్‌ వంటి లగ్జరీ ఫీచర్లు కారును అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాయి.

బాహ్య ఆకృతి – నూతన డిజైన్ హైలైట్స్‌

కారు బాహ్యంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా ట్రాపెజోడియల్‌ గ్రిల్, స్ప్లిట్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, వాటర్‌ఫాల్‌ స్టైల్‌ రియర్‌ లైటింగ్‌, 19 అంగుళాల సెల్ఫ్‌-సీలింగ్‌ టైర్లు వాడబడ్డాయి. మెటల్‌ బ్లాక్‌, కాంక్రీట్ గ్రే, పెర్ల్ లస్ట్రే వైట్‌ రంగుల్లో ఈ కారు లభ్యమవుతుంది.

భద్రత, స్మార్ట్ టెక్నాలజీ – అంతర్జాతీయ ప్రమాణాలు

ఎం9 వాహనాన్ని అల్ట్రా హై స్ట్రెంత్‌ స్టీల్‌తో నిర్మించారు. ఇది భద్రత పరంగా అత్యుత్తమ రక్షణను అందించగలదని యూరో ఎన్‌క్యాప్‌, ఏఎన్‌క్యాప్‌ రేటింగ్స్‌లో 5-స్టార్ రేటింగ్ పొందడం ద్వారా నిరూపితమైంది. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, అడాస్‌ లెవల్‌-2, డ్రైవర్‌ మానిటరింగ్ సిస్టమ్‌ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను అందించారు.

పోటీలో ఎవరెవరు?

ఎంజీ ఎం9 కారును మార్కెట్లోకి తీసుకొచ్చిన అనంతరం, ఇది కియా కార్నివాల్, టొయోటా వెల్‌ఫైర్, లెక్సస్‌ ఎల్‌ఎమ్‌ వాహనాలతో పోటీ పడనుంది. ఈ కారుతో లగ్జరీ ఈవీ విభాగంలో కొత్త శకం మొదలవుతుందని కంపెనీ ఎండీ అనురాగ్ మెహరోత్రా వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ..ఎంజీ ఎం9 భారత లగ్జరీ ఈవీ మార్కెట్‌ను ముందుకు నడిపే కారు. ఇది నూతన డిమాండ్‌కు దారి చూపే ట్రెండ్‌సెట్టర్‌ అని తెలిపారు.

Read Also: CM Chandrababu: ఏపీలో ఐటీ బలోపేతానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!