Honda Nissan Merger : వాహన రంగంలో మరో సంచలనం జరగబోతోంది. జపాన్‌కు చెందిన ప్రఖ్యాత వాహన తయారీ కంపెనీలు హోండా మోటార్ , నిస్సాన్ మోటార్‌లు త్వరలోనే విలీనం కానున్నాయి. దీనిపై ఇరు కంపెనీల మధ్య చర్చలు జరిగాయని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా వాహన రంగంలో పోటీని ఎదుర్కొనేందుకు ఈ రెండు బడా కంపెనీలు విలీనం(Honda Nissan Merger) అవుతున్నాయని అంటున్నారు. హోండా, నిస్సాన్ కంపెనీలు విలీనమైతే.. సంయుక్తంగా వాటి వాహనాల వార్షిక ఉత్పత్తి 74లక్షలకు చేరనుంది. వాహనాల విక్రయాల విషయంలో టయోటా, వోక్స్‌వ్యాగన్ కంపెనీల తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ గ్రూపుగా ‘హోండా – నిస్సాన్’ జాయింట్ వెంచర్ నిలుస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఈ సంవత్సరం మార్చిలోనే ఈ కంపెనీలు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. డిసెంబరు 23వ తేదీన హోండా, నిస్సాన్ కంపెనీలు కీలకమైన సంయుక్త ప్రకటనను విడుదల చేస్తాయనే టాక్ వినిపిస్తోంది.
Also Read :H 1B Visa Rules : భారతీయ టెక్ నిపుణులకు గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసా రూల్స్ సులభతరం
తైవాన్‌కు చెందిన టెక్ దిగ్గజం ‘ఫాక్స్‌కాన్’ కూడా ఎలక్ట్రిక్ వాహన రంగంపై ఆసక్తితో ఉంది. ఈనేపథ్యంలో నిస్సాన్ కంపెనీని ఫాక్స్‌కాన్ కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. నిస్సాన్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనేందుకు తాము సిద్ధమని ‘ఫాక్స్‌కాన్’ ప్రపోజ్ చేసిందట. అయితే దీనిపై నిస్సాన్ కంపెనీ ఎలా స్పందించింది అనే వివరాలు తెలియరాలేదు. నిస్సాన్ కంపెనీలో ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ కంపెనీకి అత్యధికంగా 36 శాతం వాటా ఉంది. జపాన్‌కు చెందిన మిత్సుబిషి మోటార్స్ కంపెనీకి కూడా నిస్సాన్‌లో పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం.
Also Read :Google report : 2024లో భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన ప్రయాణ గమ్యస్థానాలు ఇవే..
ఎలక్ట్రిక్ వాహన తయారీ విభాగంలో రానున్న రోజుల్లో పెట్టుబడులను పెంచుతామని హోండా కంపెనీ ఈ ఏడాది మే నెలలో ప్రకటించింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడి పెడతామని వెల్లడించింది.2040 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలనే తయారు చేయాలనే లక్ష్యంతో హోండా ఉంది. మరోవైపు నిస్సాన్ కంపెనీ ఈ ఏడాది నవంబరు నెలలో 9వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. రాబోయే మూడేళ్లలో 16 కొత్త కార్ల మోడళ్లను విడుదల చేయాలనే ప్లాన్‌తో నిస్సాన్ ఉంది.