Ola Uber : ఉబెర్, ఓలా యాప్‌లు చాలా ఫేమస్. వీటిని నిత్యం కోట్లాది మంది వినియోగిస్తుంటారు. అయితే తాజాగా ఆ రెండు క్యాబ్ సర్వీసుల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉబెర్, ఓలాలకు కేంద్ర వినియోగదారుల శాఖ నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఎఫెక్టు వల్లే ఈ నోటీసులు ఇచ్చింది. ఇంతకీ ఆ ఫిర్యాదులేంటో ఈ వార్తలో చూద్దాం..
Also Read :Secret Service Agent : తన ప్రాణాలు కాపాడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు ట్రంప్ బంపర్ ఆఫర్
ఉబెర్, ఓలాలపై ఫిర్యాదు ఏమిటి ?
ఉబెర్, ఓలా యాప్‌ల ద్వారా ప్రజలు కార్లు, ఆటోలు, బైక్ రైడ్‌లను బుక్(Ola Uber) చేసుకుంటారు. మనం ప్రయాణించే దూరాన్ని బట్టి ఆ యాప్‌లు రైడ్ ధరను నిర్ణయిస్తాయి. అయితే ఈ ధర అనేది ఫోన్ రకాన్ని బట్టి మారిపోతోందని కేంద్ర వినియోగదారుల శాఖకు కంప్లయింట్స్ వెల్లువెత్తాయి. ప్రయాణ దూరం, రూట్ ఒక్కటే అయినా.. రైడ్ ధర ఐఫోన్లలో ఒక రకంగా, ఆండ్రాయిడ్ ఫోన్లలో మరో రకంగా చూపిస్తోందని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. తక్కువ రేటు ఫోన్లలో ఓ రకంగా, ఎక్కువ రేటు ఫోన్లలో మరో రకంగా రైడ్ ధరను చూపించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల మధ్య వాడివేడి చర్చ సాగింది. చివరకు దీనిపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) చర్యలకు ఉపక్రమించింది. ఒకే ప్రయాణ సర్వీసుకు రెండు వేర్వేరు ధరలను ఎలా నిర్ణయిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఉబెర్, ఓలాలను నిలదీసింది. ఒకే రూట్, ఒకే దూరానికి సంబంధించిన ప్రయాణ ధరల్లో వ్యత్యాసం ఉందని స్పష్టంగా అర్థమవుతోందని సీసీపీఏ వెల్లడించింది. ఛార్జీల విషయంలో నిజాయితీ, పారదర్శకతను తీసుకొచ్చేందుకు సరైన వివరణతో తమ ఎదుటకు రావాలని ఉబెర్, ఓలాలను సీసీపీఏ ఆదేశించింది. ఈ మేరకు వివరాలను తెలుపుతూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
Also Read :Maoist Setback : మావోయిస్టుల సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా ?
సోషల్ మీడియాలో జరిగిన చర్చ ఇదీ..
ఇటీవలే ఢిల్లీకి చెందిన రిషబ్ సింగ్ అనే వ్యక్తి ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘‘క్యాబ్ సర్వీసులు అందించే ఉబెర్ సంస్థ ఫోన్లను బట్టే కాదు, అందులో ఉన్న బ్యాటరీ పర్సంటేజీని బట్టి కూడా ఛార్జీల్లో వ్యత్యాసాన్ని చూపిస్తోంది. రెండు ఆండ్రాయిడ్, రెండు ఐఓఎస్ డివైజులను వినియోగించి దీన్ని మేం గుర్తించాం. అన్ని డివైజుల్లోనూ ఒకే అకౌంట్‌తో లాగిన్ అయి.. ఒకే ప్రదేశానికి రైడ్ బుక్ చేసినప్పుడు ఫేర్‌లో ఈ తేడాను గుర్తించాం’’ అని రిషబ్ సింగ్ రాసుకొచ్చాడు. ఈ తరహా ఫిర్యాదులపై సోషల్ మీడియాలో బాగా చర్చ జరగడంతో కేంద్ర సర్కారు రంగంలోకి దిగింది.