Adani EV : ఉబెర్‌ – అదానీ గ్రూప్ ఈవీ వ్యాపారం.. ఏం చేస్తారంటే ?

Adani EV : ఇప్పుడు దేశంలో ఏ రంగాన్ని అదానీ గ్రూప్ ముట్టుకుంటే.. ఆ రంగం బంగారంలా డెవలప్ అయిపోతోంది.

  • Written By:
  • Updated On - February 26, 2024 / 02:07 PM IST

Adani EV : ఇప్పుడు దేశంలో ఏ రంగాన్ని అదానీ గ్రూప్ ముట్టుకుంటే.. ఆ రంగం బంగారంలా డెవలప్ అయిపోతోంది. ఇప్ప టికే విద్యుత్, మౌలికం, విమానయానం, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అదానీ గ్రూప్ సత్తా చాటుతోంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ కేంద్రంగా ఏర్పాటైన కంపెనీ కావడం అదానీ గ్రూప్‌కు బాగా కలిసొస్తోందని అంటున్నారు. తాజాగా అదానీ గ్రూప్ ఫోకస్ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వ్యాపారంపై పడింది. దీంతో ఉబెర్ టెక్నాలజీస్‌తో అదానీ గ్రూప్ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.  ఉబెర్‌కు చెందిన రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లో అదానీ సొంతంగా ఈవీ కార్లను ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

ఇటీవల ఉబెర్  సీఈఓ ఖోస్రోషాహి,  అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మధ్య ఈ డీల్‌పై చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా  అదానీ గ్రూప్ ఎలక్ట్రిక్ కార్లను కొని వాటిని బ్రాండ్ చేసి ఉబెర్ నెట్‌ వర్క్‌లో చేర్చనుంది. ఉబెర్ సహకారంతో అదానీ గ్రూప్ ప్రధాన వ్యాపారాలైన పోర్టులు, విమానాశ్రయ కార్యకలాపాల కోసం ఈ ఎలక్ట్రిక్ వాహనాలను  వినియోగించనున్నారు. 3,600  ఈవీ బస్సుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆహ్వానించిన టెండర్లలోనూ అదానీ గ్రూప్ బిడ్లు దాఖలు చేసింది. ఉబెర్ సైతం 2040 సంవత్సరం నాటికి జీరో ఎమిషన్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.  ప్రస్తుత వాహనాలను ఈవీలతో భర్తీ చేయాలని యోచిస్తోంది. 2013 సంవత్సరంలో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఉబెర్ సంస్థ ప్రస్తుతం మన దేశంలోని 125 నగరాల్లో సేవలు అందిస్తోంది. దీనివల్ల అదానీ సూపర్ యాప్ ‘అదానీ వన్’ విస్తరణకు బాటలు పడతాయని అంచనా వేస్తున్నారు.

‘‘భారత్‌లో ఉబెర్ విస్తరణకు  సీఈఓ దారా ఖోస్రోషాహి చేసిన కృషి, డ్రైవర్ల గౌరవం పెంచడంలో ఆయన నిబద్ధత స్ఫూర్తిదాయకం. మున్ముందు ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తితో ఉన్నాం’’ అని ఇటీవల  ఆయనతో భేటీ అనంతరం గౌతం అదానీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి స్పందిస్తూ.. ‘‘గౌతం అదానీతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ అద్భుతమైన సంభాషణ జరిపాం. భారత్ గ్రోత్ విషయమై చర్చించాం’’ అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. భారతదేశంలో వ్యాపారం మరింత విస్తరించడానికి, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి మారేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.