Pulivendula : పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తోంది. నిన్న జరిగిన ఓటింగ్ సందర్భంగా పలుచోట్ల అక్రమాలు చోటు చేసుకున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఫిర్యాదు చేయడంతో, ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.
Read Also: Manchu Lakshmi : ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి
ఈ రీపోలింగ్‌ను వైసీపీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ..ఇది కంటితుడుపు చర్య మాత్రమే. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ పులివెందులలో సరికొత్త సంస్కృతిని తీసుకొచ్చింది. అది అక్రమ ఓట్ల కలెక్షన్, బూత్ క్యాప్చరింగ్, ఓటర్లను బెదిరించడం అంటూ మండిపడ్డారు. మొత్తం 15 బూత్‌లలో అక్రమ ఓట్లు వేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి స్థానిక ఓటర్ల నుంచి ఓటు స్లిప్‌లు తీసుకొని, వారే వేశారు. ఇది న్యాయవ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానం అని అన్నారు. రూపొందించిన రీపోలింగ్ అనేది పూర్తిగా ‘డ్రామా’ అని అభివర్ణించారు అవినాశ్ రెడ్డి. ఓటర్లను మభ్యపెట్టేందుకు, తప్పుదారి పట్టించేందుకు టీడీపీ ఎన్ని నాటకాలు ఆడినా, ప్రజలు ఎప్పుడూ నిజాన్ని గుర్తిస్తారు అని అన్నారు. ఎన్నికల కమీషన్‌పై కూడా ఆయన నిప్పులు చెరిగారు. నిర్బంధ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ జరగడం బాధాకరం.
ఎన్నికల కమీషన్‌ను రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతుందన్న అనుమానం కలుగుతోంది అని అన్నారు. రిపోలింగ్‌ను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలి. ప్రజాస్వామ్య విలువలు రక్షించాలంటే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ తప్పనిసరి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలంటే కేంద్ర బలగాల అవసరం. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పులివెందుల ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఏదేమైనా, అధికార పార్టీలు, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు, విమర్శల మధ్య పులివెందుల ప్రజలే నష్టపోతున్నారన్నది స్పష్టమవుతోంది. ఎన్నికల సమర్థతపై ప్రజల్లో అనేక సందేహాలు కలుగుతున్న ఈ సమయంలో, ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.
Read Also: Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన