Site icon HashtagU Telugu

YSRCP Vs Waqf Act: వక్ఫ్ సవరణ చట్టంపై ‘సుప్రీం’లో వైసీపీ పిటిషన్

Ysrcp Vs Waqf Amendment Act Ysrcp Petition Supreme Court Ys Jagan

YSRCP Vs Waqf Act: ఇటీవలే పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టంపై వైఎస్సార్ సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ చట్టంలో ముస్లింలకు అభ్యంతరకరంగా ఉన్న పలు క్లాజుల్ని రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి ముస్లిం సమాజపు ఆందోళనలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ ఆరోపించింది. ఆ చట్టంలోని రాజ్యాంగ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించాలని కోర్టును కోరింది.

Also Read :Coconut Water: కొబ్బరి బోండంలోకి నీళ్లు ఎలా చేరుతాయి ? వేళ్ల నుంచి టెంకలోకి దారేది ?

రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా..

వక్ఫ్ బిల్లును సవాలు చేస్తూ తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వైఎస్సార్ సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. వక్ఫ్ సవరణ చట్టం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 25, 26లను ఉల్లంఘించేలా ఉందని పేర్కొంది. ప్రాథమిక హక్కులు, చట్టపరమైన సమానత్వం, మత స్వేచ్ఛ వంటి అంశాలకు వ్యతిరేకమైన నిబంధనలు వక్ఫ్ సవరణ చట్టంలో ఉన్నాయని వైఎస్సార్ సీపీ ఆరోపించింది. ‘‘సెక్షన్ 9, 14 కింద ముస్లిమేతర సభ్యులను వక్ఫ్ బోర్డులలో చేర్చడం సరికాదు. దీనివల్ల వక్ఫ్ సంస్థల అంతర్గత పనితీరులో అన్యుల జోక్యానికి అవకాశం కలుగుతుంది.  ఈ నిబంధనలు వక్ఫ్ బోర్డుల మతపరమైన లక్షణాన్ని, పరిపాలనా స్వాతంత్రాన్ని దెబ్బతీస్తాయి’’ అని వైఎస్సార్ సీపీ పేర్కొంది.

Also Read :Golconda Blue : ‘గోల్కొండ బ్లూ’ వజ్రం వేలం.. చరిత్ర తెలుసా ?

వైఎస్సార్ సీపీ(YSRCP Vs Waqf Act) ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లోనూ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేసింది. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎం, ఆప్, హీరో  విజయ్, పలు ముస్లిం సంస్ధలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిపై ఎల్లుండి సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. వైఎస్సార్ సీపీ పిటిషన్‌ను కూడా వీటితో కలిపి సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.