Site icon HashtagU Telugu

YSRCP Vs BJP : వైసీపీ నుంచి మెజార్టీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్తారా? ఏం జరగబోతోంది ?

Ysrcp Vs Bjp Ysrcp Rajya Sabha Mps Ap Politics Tdp Chandra Babu

YSRCP Vs BJP : కీలక నేతలు, ఎంపీల వరుస రాజీనామాలు వైఎస్సార్ సీపీని కుదిపేస్తున్నాయి. ప్రత్యేకించి ఎంపీ విజయసాయిరెడ్డి  రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామాను ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరేది లేదని ఆయన తేల్చి చెప్పారు. మరో రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో వైఎస్సార్ సీపీలో తదుపరిగా ఏం జరగబోతోంది ? ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలంతా ఏం చేయబోతున్నారు ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఏపీ నుంచి పార్టీలవారీగా రాజ్యసభ సభ్యులు వీరే..  

ఏ పార్టీకి ఎంతమంది:   వైఎస్సార్ సీపీ (8), టీడీపీ (2), బీజేపీ (1)

సంఖ్య రాజ్యసభ ఎంపీ పేరు పార్టీ నియామక తేదీ రిటైర్మెంట్ తేదీ
1 వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్ సీపీ 02- ఏప్రిల్-2024 01-ఏప్రిల్-2030
2 గొల్ల బాబూరావు వైఎస్సార్ సీపీ 02- ఏప్రిల్-2024 01-ఏప్రిల్-2030
3 మేడ రఘునాధ రెడ్డి వైఎస్సార్ సీపీ 02- ఏప్రిల్-2024 01- ఏప్రిల్-2030
4 వి.విజయసాయి రెడ్డి వైఎస్సార్ సీపీ 22-జూన్-2022 21- జూన్-2028
5 ఆర్.క్రిష్ణయ్య బీజేపీ 13-డిసెంబరు-2024 21-జూన్ -2028
6 ఎస్.నిరంజన్ రెడ్డి వైఎస్సార్ సీపీ 22-జూన్-2022 21-జూన్ -2028
7 బీద మస్తాన్ రావు టీడీపీ 13-డిసెంబరు-2024 21-జూన్-2028
8 ఆళ్ల అయోధ్యరామి రెడ్డి వైఎస్సార్ సీపీ 22-జూన్-2020 21-జూన్ -2026
9 సానా సతీశ్ బాబు టీడీపీ 13-డిసెంబరు-2024 21-జూన్-2026
10 పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ సీపీ 22-జూన్-2020 21-జూన్-2026
11 పరిమళ్ నత్వానీ వైఎస్సార్ సీపీ 22-జూన్-2020 21- జూన్-2026

Also Read :Foreign Aid Freeze : ఉక్రెయిన్‌కు ట్రంప్ షాక్.. రష్యాకు ఊరటనిచ్చే సంచలన నిర్ణయం

‘2019’ ఫలితాల తర్వాత.. ‘2024’ ఫలితాల తర్వాత.. 

2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఆనాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగైదు నెలల తరవాత ఒక్క కనకమేడల రవీంద్ర తప్ప మిగతా రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో చేరిపోయారు. చివరకు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ లాంటి టీడీపీ విధేయులు కూడా బీజేపీలో చేరిన ఎంపీల జాబితాలో ఉన్నారు. కట్ చేస్తే.. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్సార్ సీపీలోనూ దాదాపు అలాంటి సీనే కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు తులనాత్మక విశ్లేషణ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీకి జైకొట్టే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి మొత్తం 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 8 మంది వైఎస్సార్ సీపీవారే. వీరిలో చాలామంది బీజేపీలోకి జంప్(YSRCP Vs BJP) అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి  రాజీనామాతో ఈ దిశగా సంకేతం వెలువడిందని అంటున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామాను ప్రకటించే క్రమంలో విజయసాయిరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల పేర్లను ఆయన  ప్రస్తావించడం గమనార్హం.

Also Read :Vijayasai Reddy : విజయసాయి రాజీనామా వెనుక వ్యూహం ఏంటి..?

విజయసాయి రెడ్డిపై అరబిందో ఎఫెక్ట్.. 

వాస్తవానికి విజయసాయిరెడ్డికి రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం 2028 జూన్ 21 వరకు ఉంది. అయినా హఠాత్తుగా ఆయన ఎందుకు పదవిని  వదులుకున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ సీపీ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మంది రాజ్యసభ ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకునే క్రమంలోనే బీజేపీ పెద్దలు తెర వెనుక నుంచి ఈ స్కెచ్‌ను అమలు చేయిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి కచ్చితంగా జగన్‌కు సమాచారాన్ని అందజేసిన తర్వాతే రాజీనామాపై ప్రకటన చేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో నంబరు-2 స్థాయిలో ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా అనేది వైఎస్సార్ సీపీకి పెద్ద దెబ్బే. కాకినాడ పోర్టు లావాదేవీల్లో విజయసాయి రెడ్డి వియ్యంకుడి కంపెనీ అయిన అరబిందో ఫార్మా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం గమనార్హం. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా నిందితుడుగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలోకి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. అయోధ్య రామిరెడ్డి సోదరుడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఇటీవలే వైఎస్సార్ సీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.