Site icon HashtagU Telugu

TTD : కోట్లాది రూపాయాల టీటీడీ నిధులు వైసీపీ నేతలు మింగేశారు: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

YSRCP leaders have swallowed crores of rupees of TTD funds: TTD Chairman BR Naidu

YSRCP leaders have swallowed crores of rupees of TTD funds: TTD Chairman BR Naidu

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను కాపాడేందుకు టీటీడీ నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్పష్టంచేశారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంతాజ్‌ హోటల్‌ వ్యవహారం, వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నిధుల దుర్వినియోగంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల టీటీడీ నిధులను అక్రమంగా మింగేశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని ప్రపంచానికి గొప్పగా తెలియజేయాల్సిన బాధ్యతను టీటీడీ నిర్వర్తిస్తోందని, అలాంటి సంస్ధపై రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారాలు చేయడం బాధాకరమన్నారు.

Read Also: Heavy rains : జమ్మూకశ్మీర్‌లో జల ప్రళయం.. వైష్ణోదేవి యాత్ర నిలిపివేత

తిరుమలకు ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని ముంతాజ్‌ హోటల్‌కు కేటాయించడం వైసీపీ ప్రభుత్వపాలనలో జరిగిన ఘోరమైన తప్పు అని ఆయన పేర్కొన్నారు. పవిత్రతకు ప్రతీకగా ఉన్న తిరుమలలో వాణిజ్యపరమైన హోటల్‌ నిర్మాణం తగదని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. అదే సమయంలో, హోటల్ యాజమాన్యాన్ని ఒప్పించి మరో ప్రాంతంలో 25 ఎకరాల భూమిని కేటాయించేలా సర్దుబాటు చేయడం చంద్రబాబు ఆలోచనాశీలి నాయకుడిగా తీసుకున్న సత్సిద్ధతని నాయుడు వివరించారు. టీటీడీ భూములను ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఇదంతా వైసీపీ నాయకుల పక్కా రాజకీయ కుట్ర అని అన్నారు. టీటీడీ వ్యవహారంలో సీబీఐ విచారణ జరపాలని కోరుతున్న వైసీపీ నేతలు మళ్లీ మల్టీప్లెక్స్‌ కామెడీ చేస్తున్నట్లే ఉంది అంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలోనే కాదు, భూకబ్జాల్లోనూ పాలుపంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ముంతాజ్‌ హోటల్‌కు భూములు అప్పగించేందుకు అజయ్‌ అనే వ్యక్తిని బెదిరించిన ఘనత కూడా జగనే సాధించాడు. పాయింట్‌బ్లాంక్‌ రేంజ్‌లో తుపాకితో బెదిరించిన ఘటనను తేల్చాలి. ఇది చిన్న విషయం కాదు. విచారణ జరిపితే నిజాలు బహిర్గతమవుతాయి అని నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో నివసించేందుకు భూమన కరుణాకర్‌రెడ్డి అనర్హుడని, అలాంటి వ్యక్తులను తిరుపతిలో తిష్తాపెట్టనివ్వకూడదని అన్నారు. తిరుపతి పవిత్రతను కాపాడుకోవాలంటే ఇటువంటి దుర్మార్గులను నగరం నుంచి తరిమికొట్టాలి అని ఆయన పేర్కొన్నారు. చివరగా, టీటీడీ బోర్డు కొత్తగా వచ్చిన తర్వాత అవినీతికి తావులేకుండా పారదర్శకంగా, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయకుండా వ్యవహరిస్తోందని నాయుడు తెలిపారు. శ్రీవారి సేవలో వుంటూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, రాజకీయప్రేరిత నిర్ణయాలకు తావులేని విధంగా మేము పని చేస్తున్నాం. ఇది భక్తులకే కాదు, ప్రజలకూ తెలియాల్సిన విషయం అని పేర్కొన్నారు.

Read Also: Gautam Gambhir: ఆసియా కప్‌కు ముందు గౌతమ్ గంభీర్‌కు భారీ షాక్‌!