YS Jagan: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కేటీఆర్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జగన్ తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతా ద్వారా.. “నా సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతీ అడుగులోనూ విజయం మిమ్మల్ని అనుసరిస్తుంది. మీ కలలు సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఈ సందేశంలో కేటీఆర్‌ను ‘సోదరుడు’ అని సంబోధించడం, ఆయన లక్ష్యాలు నెరవేరాలని ఆకాంక్షించడం పట్ల ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు సానుకూలంగా స్పందిస్తున్నారు.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్‌కు మెటాటార్సల్ గాయం.. మాంచెస్టర్ టెస్ట్‌కు కష్టమేనా?
Wishing my brother Tarak a very Happy Birthday. May success follow you in every step, and may your dreams take shape with strength and clarity.@KTRBRS
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2025
గతంలో వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల ఆ సాన్నిహిత్యం కొంత దూరమయ్యిందని భావిస్తారు. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్‌తో వ్యక్తిగత స్థాయిలో సత్సంబంధాలను కొనసాగించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారాన్ని కోల్పోయి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేసిన ఈ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇది కేవలం ఒక మర్యాదపూర్వక శుభాకాంక్షగా భావించినా.. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆసక్తులున్న అంశాలపై రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు కొనసాగడానికి ఈ ట్వీట్ ఒక సంకేతంగా నిలవవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.