నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు , కాంగ్రెస్ శ్రేణులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. YSR స్వగ్రామమైన పులివెందులలో నివాళులర్పించేందుకు జగన్, షర్మిల, విజయమ్మ తల్లి కలిసి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా అన్నా చెల్లెలు కలుస్తారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. వైఎస్సార్ అభిమానులు మాత్రం “ఒక్క రోజు అయినా కలిస్తే బాగుండేది” అనే ఆశతో ఉన్నా, గతంలో నెలకొన్న విభేదాల దృష్ట్యా ఇది జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయని సన్నిహితులు అంటున్నారు.
ఒకప్పుడు జగన్ కోసం బాణం అంటూ ప్రచారం చేసిన షర్మిల, ప్రస్తుతం జగన్ వేరు అన్నట్లు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఆమెకు రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయం జరిగిందన్న భావన బలంగా ఉండటంతో అన్న-వదినలపై తీవ్రంగా అలక పట్టుకున్నారు. ఈ గ్యాప్‌ను విజయమ్మ కూడా పరోక్షంగా మద్దతిస్తుండటం గమనార్హం. ఎన్నికల సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల పోటీ చేయడం, జగన్‌పై వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఈ విభేదాలను మరింత లోతుగా తీసుకెళ్లాయి. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ షర్మిల ఆశించిన మేరకు తన వర్గం పెరగలేదు. ఇదే సమయంలో జగన్ పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో కోలుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని జగన్, షర్మిల, విజయమ్మ పులివెందులకు వెళ్లడం ఖాయమైనా, వాళ్లంతా ఒకే సమయంలో అక్కడ ఉంటారా? లేదా విడిగా నివాళులర్పించి వెళ్లిపోతారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. వివేకానంద రెడ్డి హత్యకేసులో షర్మిల-సునీత ఒకే వైఖరిని తీసుకోవడం, జగన్‌పై విమర్శలు చేయడమన్నివి వారి మధ్య భేదాలు ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. అయినా తల్లి విజయమ్మ అక్కడికి వెళ్లడం వల్ల, షర్మిలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న కోణం ఉండడంతో ఓ చిన్న సంభావ్యత మిగిలి ఉందనే ఊహాగానాలు రాజకీయం చేస్తోంది. ఏది జరిగినా వైఎస్సార్ జయంతి రోజున ఆ కుటుంబ కలయికపై దృష్టి అంతా నిలవడం ఖాయం.