మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case) ఇప్పటికీ న్యాయ పరిధిలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కుమార్తె వైఎస్ సునీత (YS Sunitha) గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీరు(Governor Justice Abdul Nazeer)ను కలిశారు. రాజ్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆమె తన తండ్రి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటికే చాలా కాలంగా ఈ కేసు విచారణ కొనసాగుతున్నా, న్యాయం ఆలస్యం అవుతున్నదని ఆమె గవర్నర్‌కు వివరించారు. హత్య కేసులో వచ్చిన తాజా పరిణామాలను కూడా గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.
AP & TG Temperatures : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఎండ తీవ్రత
వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి 6 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నానని ఇటీవల సునీత ఒక ప్రకటనలో తెలిపారు. తన తండ్రి హత్యకు కారకులైన వారు ఇప్పటికీ శిక్షించబడలేదని, నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికీ ఈ కేసు విషయంలో రాజీ పడబోనని, నిందితులకు తగిన శిక్ష పడేంత వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిసి విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. హత్య కేసు విషయంలో రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని న్యాయ పరంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. నిందితులను శిక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాలని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె గవర్నర్‌ను కోరారు. కేసు పరిణామాలు ఎలా మారతాయో అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.