YS Sharmila : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నవంబర్ 11 నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలను వైఎస్‌ఆర్‌సీపీ బహిష్కరించింది. వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని.. ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామనే కారణంతోనే ఇలా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా జగన్ అదే పాట పాడుతున్నారని విమర్శించారు.
జగన్‌ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని విషయం గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైకు ఇవ్వరని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీకి గతంలో 151 సీట్లు ఇస్తే ప్రజలను అన్ని విధాలా మోసం చేశారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.
అయితే తాము అధికారంలోకి రాకుంటే అసెంబ్లీకి వెళ్లమని జగన్ అప్పుడు చెప్పలేదే. మీకు ప్రజలు ఓట్లు వేసింది అసెంబ్లీకి వెళ్లమనే కదా. ప్రజల తరపున గెలిచిన వారు అసెంబ్లీకి వెళ్లాలి. ఇది సరైన విధానమా… మీరు సభను అవమానిస్తున్నారా. నిన్న బడ్జెట్ సమావేశానికి కూడా వెళ్లలేదు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపే బాధ్యత జగన్‌కు లేదా. అసెంబ్లీకి వెళ్లకుంటే మీరు రాజీనామా చేయాలి. మళ్లీ అసెంబ్లీకి వెళ్లమని చెప్పి ఎన్నికలకు వెళ్లండి. అప్పుడు ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి వెళ్లాలని కాంగ్రెస్ పక్షాన లేఖ రాశాను” అని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Read Also: Mlas Defection Case : పార్టీ ఫిరాయింపుల కేసు..తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు