YS Rajasekhara Reddy: రాహుల్ కు ధన్యవాదాలు తెలిపిన షర్మిల

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

YS Rajasekhara Reddy: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ, ఆప్యాయంగా నివాళులు అర్పించినందుకు ట్విట్టర్ వేదికగా ఆమె రాహుల్ కు ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్ మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ధన్యవాదాలు సర్ అన్నారు.

అంతకుముందు రాహుల్ గాంధీ వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడు అని కొనియాడారు.

కాగా.. ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ కుటుంబం నివాళులు అర్పించారు. నాన్న ఈ లోకాన్ని వదిలివెళ్ళినా..ప్రతి పేదవాడి చిరునవ్వులోనూ నాన్న బ్రతికే ఉన్నారని షర్మిల వైఎస్ఆర్ ని గుర్తు చేసుకున్నారు. రైతులు, ఆడబిడ్డల అభ్యున్నతి కోసం నాన్న కన్న ప్రతి కల.. నేను నెరవేరుస్తా అని ఆమె చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో, తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఎంతగా కృషి చేశారో అందరికీ తెలుసని ఆమె అన్నారు. ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సంతకం రైతుల కోసమే పెట్టారని షర్మిల చెప్పారు. రుణమాఫీ, ఫీ రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది. కేవలం 5 సంవత్సరాలలో 46 లక్షల పేదలకు ఇండ్లు కట్టించారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు అందించారు. పోడు భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చారు. ప్రతి వర్గంలో ప్రతి ఒక్కరి హృదయంలో చోటు సంపాదించుకున్నారు. వైయస్ఆర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్క హృదయానికి వైయస్ఆర్ గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటుందని షర్మిల అన్నారు.

Read More: Chandrababu Naidu: రోజుకో ఘోరం, ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం : జగన్ పై చంద్రబాబు ఫైర్!