YS Murder : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్ర‌ద‌ర్ అరెస్ట్ కు రంగం సిద్ధం, క‌డ‌ప‌లో CBI వేట‌

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య(YS Murder) కేసు మిస్టరీని ఛేదించ‌డానికి సీబీఐ(CBI) వేగం పెంచింది.

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 03:30 PM IST

మాజీ మంత్రి, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య(YS Murder) కేసు మిస్టరీని ఛేదించ‌డానికి సీబీఐ(CBI) వేగం పెంచింది. ఏ క్ష‌ణ‌మైనా క‌డ‌ప పెంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి రంగం సిద్దం చేసింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌కు స‌మ‌న్ల‌ను జారీ చేసింది. అయితే, ఐదు రోజుల త‌రువాత హాజ‌రవుతాన‌ని ఆయ‌న ఇచ్చిన స‌మాధానం అందిన త‌రువాత మ‌రోసారి స‌మ‌న్ల‌ను ఇవ్వ‌డం చూస్తుంటే, ఈసారి సీబీఐ వ‌దిలేలా క‌నిపించ‌డంలేదు. కేసు కూడా క‌డ‌ప నుంచి హైద‌రాబాద్ కు షిఫ్ట్ కావ‌డంతో సీబీఐ దూకుడు పెంచింది.

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు మిస్టరీ (YS Murder)

ముఖ్య‌మంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వివేకా హ‌త్య(YS Murder) జరిగింది. హైప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసుగా దీన్ని పరిగణించారు. 2019 మార్చి 15వ తేదీన ఆయ‌న నివాసంలోనే వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్య జ‌రిగింది. ఈ హ‌త్య గ‌త ఎన్నిక‌లను రాజ‌కీయంగా ఊపేసింది. ఆనాడు మంత్రిగా ఉన్న ఆదినారాయ‌ణ రెడ్డి మీద తొలుత‌ ఆరోపణలు వచ్చాయి. వివేకా కుమార్తే డాక్ట‌ర్ సునీత కొందరిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంటి వాచ్‌మన్‌ రంగయ్య, సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అనుచరుడు ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి, పరమేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డిల పేర్లను ఈ కేసులో చేర్చారు. అనేక మందిని నాలుగేళ్ల పాటు విచారించారు.

Also Read : YS Murder :రాజ‌కోట ర‌హ‌స్యంపై ష‌ర్మిల కామెంట్స్, మ‌ళ్లీ పాద‌యాత్ర‌కు రెడీ!

తాజాగా క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించిన సీబీఐ(CBI) ఆక‌స్మాత్తుగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. విచార‌ణ కోసం హైద‌రాబాద్ లోని సీబీఐ కార్యాల‌యానికి రావాల‌ని స‌మ‌న్లు జారీ చేసింది. కానీ, హాజ‌రుకాలేనని అనినాష్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. దీంతో సీబీఐ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు త‌ర్వాత మ‌రికొంత మందిని అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. సీబీఐ చేతిలో అనుమానితుల లిస్టు ఉంద‌ని వినికిడి. కొన్ని పెద్ద‌త‌ల‌కాయ‌లు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అభియోగాల పై అవినాష్ రెడ్డి స్పందించారు. ఐదు రోజుల త‌ర్వాత సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రవుతాన‌ని చెప్పారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో పెద్ద‌త‌ల‌కాయ‌లు ఉన్నాయ‌ని మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఆరోపించారు.

హైద‌రాబాద్ నుంచి పులివెందుల‌కు సీబీఐ బృందం

ఐదు రోజుల త‌రువాత హాజ‌ర‌వుతాన‌ని అవినాష్ రెడ్డి చెప్పిన దానికి సీబీఐ అంగీక‌రించ‌లేదు. ఆయ‌న కోసం హైద‌రాబాద్ నుంచి పులివెందుల‌కు సీబీఐ బృందం వెళ్లింది. ఏ క్ష‌ణ‌మైనా ఆయ‌న్ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంది. ఆ మేర‌కు స్థానిక పోలీసుల‌కు సీబీఐ బృందం స‌మాచారం ఇచ్చింద‌ని తెలుస్తోంది. సీబీఐ ప్ర‌త్యేక బృందం చేతిలో అరెస్టు వారెంట్ కూడా ఉంద‌ని స‌మాచారం. ఏ క్ష‌ణ‌మైనా సీబీఐ క‌స్ట‌డీలోకి అవినాష్ రెడ్డి వెళ్లే అవ‌కాశం ఉంది.మొద‌టి నుంచి ఈ కేసులో ప్ర‌ధాన అనుమానితునిగా క‌డ‌ప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన రోజే సీబీఐ నోటీసులు జారీ చేయ‌డం కేసు ద‌ర్యాప్తు వేగ‌వంతం అయింద‌ని అర్థమ‌వుతోంది.

Also Read : YS Viveka Murder : వైఎస్ వివేకా హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం.. వైసీపీ ఎంపీకి సీబీఐ స‌మాన్లు

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా కడప నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారాన్ని ప్రారంభించేందుకు కొన్ని గంటల ముందు వివేకా హత్యకు గురయ్యారు. మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్‌లు) సోదాలు నిర్వహించినా మిస్టరీని చేధించడంలో విఫ‌లం కావ‌డం ఆనాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ చేత‌గానిత‌నం. తాజాగా కొంద‌రు బంధువులపై అనుమానం వ్యక్తం చేసిన వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచార‌ణ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు 2020లో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. 2021 అక్టోబరు 26న హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జనవరి 31, 2022న అనుబంధ ఛార్జిషీటును దాఖలు ప‌రిచింది. హత్య వెనుక పెద్ద కుట్రపై విచారణ, దర్యాప్తును హైరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బ‌దిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమైన విచారణ జరగడంలేద‌ని సునీతారెడ్డి లేవనెత్తిన సందేహాలను ప‌రిశీలించి ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.