YS Jagan: వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను సోమవారం పరామర్శించారు. ఉదయం వైఎస్సార్ జిల్లా తాతిరెడ్డిపల్లికి జగన్ చేరుకున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. వర్షం, వడగళ్ల, గాలికి 4000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పార్ణపల్లె, ఏగువపల్లె, కోమటీనూతల, తాతిరెడ్డిపల్లి గ్రామాల్లో 4000 ఎకరాల్లో వర్షానికి అరటి పంటలు దెబ్బతిన్నాయి. దాదాపుగా రైతన్నలు 15 లక్షలు చొప్పున నష్ట పోయారని పేర్కొన్నారు. అయితే, పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్ అయ్యారు. 2023 – 2024కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు.
Read Also:New Cricket Stadium : ఏపీలో కొత్తగా క్రికెట్ స్టేడియం..ఎక్కడంటే !
రైతు భరోసా నిధులు క్రమం తప్పకుండా అందించామని గుర్తుచేశారు. గత ఏడాదికి చెందిన రైతు భరోసా నిధులను విడుదల చేయకుండా ఆపేసిందని మండిపడ్డారు. రైతు భరోసా కాదు తాము అధికారంలోకి వచ్చాక రైతుకు రూ.26 వేలు అందిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు 26 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. కళ్లు మూసుకుంటే ఏడాది గడిచిపోయింది. మళ్లీ కళ్లుమూసుకుని తెరిస్తే మూడేళ్లు గడిచిపోతాయి. రైతు సోదరులకు ఒకటే చెబుతున్నా మూడేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటాం అని వైఎస్ జగన్ చెప్పారు.
ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉందని గుర్తుచేస్తూ.. అయినప్పటికీ పార్టీ తరఫున రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడతామని వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు పంట బీమా డబ్బులు అందించేలా చూస్తామన్నారు. అదేవిధంగా, వైసీపీ తరఫున కూడా తోచినంత సహాయం అందించే ప్రయత్నం చేస్తామని జగన్ రైతులకు హామీ ఇచ్చారు. మా ప్రభుత్వ హయాంలో అరటిని ఎక్స్‌పోర్ట్ చేశాం. నెల క్రితం 26 వేలు పలికిన అరటిని ప్రస్తుతం అడిగేవారు లేరు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు.. మిర్చి, శనగలు, మినుములు.. ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని విమర్శించారు. 4000 ఎకరాల అరటి రైతులకు మేం అండగా ఉంటామని హామీ ఇస్తున్నా.. ఇన్సూరెన్స్ వచ్చేలా కృషి చేస్తా అని వైఎస్ జగన్ అన్నారు.
Read Also: MLC election : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల