ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly) ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, సాధారణ ఎమ్మెల్యేగా సమయం కేటాయించడం వంటి అంశాల కారణంగా జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే, ఏకధాటిగా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్నందున, కనీసం ఒక రోజు హాజరవ్వాలని వైసీపీ యోచిస్తోంది.
NEST : ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలపై NEST దృష్టి
ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభ, శాసనమండలికి ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించబడుతుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు కొనసాగించాలనే దానిపై చర్చించనున్నారు. ఫిబ్రవరి 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉండగా, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పండుగ, ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం వల్ల ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు లేకపోవచ్చని అంచనా.
ఫిబ్రవరి 28న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సందర్భంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.